వినియోగదారులకు మెరుగైన సేవలందించాలి

16 Jul, 2016 20:11 IST|Sakshi

కడప అగ్రికల్చర్ : వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి మన్ననలు పొందాలని దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థ (తిరుపతి) చీఫ్ ఇంజనీర్ నందకుమార్ కోరారు. ఇటీవల డిల్లీలో ప్రకటించిన ర్యాంకింగ్‌లో సేవలు అందించడంలో ఏపీఎస్‌పీడీసీఎల్‌కు 5వ స్థానం వచ్చిందని అన్నారు. ఈ ర్యాంకింగ్‌తో డిపార్టుమెంట్‌కు మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. శుక్రవారం కడప నగరంలోని విద్యుత్ భవన్‌లో కడప నగరంలోని విద్యుత్‌శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా సీఈ మాట్లాడుతూ వినియోగదారులకు నాణ్యతా ప్రమాణాలతో విద్యుత్ అందించాలన్నారు. సబ్‌స్టేషన్లలో తలెత్తే సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించుకోవాలన్నారు. ఒకరోజు పూర్తిగా 11కేవీ సబ్‌స్టేషన్‌లో ఉన్న సమస్యలన్నీ ఒకేసారి పరిష్కరిస్తే మళ్లీ ఒక వారమో, ఒక నెల వరకు దాంతో పని ఉండదన్నారు. ఎక్కడెక్కడ లైన్‌లాస్ అవుతున్నదో గుర్తించి తీగలు లాగడం, కండెంసర్లు సరిచేయడం,చెట్ల కొమ్మలు తొలగించడం, లైన్లు బిగుతుగా ఉండేలా సరిచేయడం వంటి వాటి కి ప్రాధాన్యత ఇస్తే సరిపోతుందన్నారు.

విద్యుత్ చౌర్యాన్ని పూర్తిగా అరికట్టేలా ఆయా చోరీదారులపై కేసులు పెట్టాలని ఆదేశించారు. విద్యుత్ బకాయిలు పెరిగిపోయాయని, వాటిపై వారం వారం స్పెషల్ డ్రైవ్ పెట్టాలని ఎస్‌ఈని ఆదేశించారు.  సమావేశంలో జిల్లా విద్యుత్‌శాఖ సూపరింటెండెంట్ ఇంజనీరు ఎన్‌విఎస్ సుబ్బరాజు, జిల్లా విద్యుత్ రెవిన్యూ అధికారి సుబ్బారావు, విజిలెన్స్ సీఐ గౌతమి తదితరులు పాల్గొన్నారు.
 

>
మరిన్ని వార్తలు