'దోచుకున్న భూముల కోసమే సెక్షన్ 8 డిమాండ్'

13 Jul, 2015 09:11 IST|Sakshi
'దోచుకున్న భూముల కోసమే సెక్షన్ 8 డిమాండ్'

సత్యవేడు: హైదరాబాద్‌లో రూ. లక్ష కోట్ల విలువజేసే 1,000 ఎకరాల భూమిని దోచుకున్న భూ రాబందుల బాగోతం టీఆర్‌ఎస్ పార్టీ బయట పెట్టుతుందన్న భయంతోనే సెక్షన్ 8 అమలును టీడీపీ కోరుతోందని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ ఆరోపించారు. చిత్తూరు జిల్లాలో సత్యవేడులో ఆయన కాంగ్రెస్ నాయకులతో కలసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు తప్పించుకోలేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి పనులను పేదల సంక్షేమం కోసం వినియోగిస్తే, నేడు చంద్రబాబు ప్రభుత్వం ఆ నిధులను ఆ పార్టీ నాయకుల సంక్షేమం కోసమే నీరు -చెట్టు పేరుతో వెచ్చిస్తోందన్నారు. ఉపాధి పథకం టీడీపీ నాయకుల ఆర్ధికాభివృద్ధి పథకంగా మారిందన్నారు. రాష్ట్రంలో ఆగస్టు నెలలో రాజకీయ సంక్షోభం తప్పదని ముఖ్యమంత్రి మార్పు ఉండవచ్చని, చంద్రబాబు స్థానంలో నారా లోకేష్‌బాబు సీఎంగా రావవచ్చని జోస్యం చెప్పారు. 

తిరుపతిలో క్యాన్సర్ హాస్పిటల్‌కు రూ. 120 కోట్ల నిధులు మంజూరు చేయించామని, ఈ హాస్పిటల్‌ను విజయవాడకు తరలించేందుకు సదరు మంత్రి ప్రయత్నిస్తుంటే జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి చేష్టలుడిగి చూస్తుంటే.. కాంగ్రెస్ ఊరుకోబోదని హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి రాజ్యమేలుతోందని, ఓ అధికారి రూ. 15 లక్షలు ఓ పెద్ద నేతకు సమర్పించి సత్యవేడుకు వచ్చారన్నారు.
 

మరిన్ని వార్తలు