ఎంసెట్‌ స్కాం దర్యాప్తు ఎటువైపు?

27 Jan, 2017 03:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఎంసెట్‌ ప్రశ్నపత్రం లీకేజీ కుంభకోణంలో తర్జనభర్జన కొనసా గుతోంది. దర్యాప్తు చేపట్టి ఏడు నెలలు కావస్తున్నా అసలు నిందితులు దొరకనేలేదు. ఇప్పటివరకు సీఐడీ అధికారులు 81 మంది బ్రోకర్లను అరెస్ట్‌ చేశారు. వారిలో చాలా మంది బెయిల్‌ కూడా పొందారు. ఇక ప్రశ్నపత్రం ప్రింటింగ్‌ వ్యవహారం, ప్రింటింగ్‌ ప్రెస్‌నుంచి ఎవరు లీక్‌ చేశారు, అక్కడి నుంచి కీలక బ్రోకర్లకు చేరవేసింది ఎవరన్న వివరాలు పూర్తిస్థాయిలో తెలియలేదు. అంతేగాకుండా ఈ మొత్తం వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్న కమిలేష్‌కుమార్‌ సింగ్‌ ఇటీవలే సీఐడీ కస్టడీలో గుండెపోటుతో మృతిచెందాడు. దీంతో దర్యాప్తు అధికారులు ఆందోళనలో పడ్డారు.

తెగిన లింకు?
ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి ప్రశ్నపత్రాన్ని బయటకు తీసుకువచ్చింది కమిలేష్‌కుమార్‌ సింగ్‌ అని సీఐడీ దర్యాప్తు అధికారులు అను మానించారు. కానీ ఈ అంశంపై విచా రిస్తున్న సమయంలోనే కమిలేష్‌ గుండె పోటుతో మృతి చెందాడు. దీంతో కేసులో ఎలా ముందుకు వెళ్లాలో అర్థంకావడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. అయితే కమిలేష్‌తో పాటు మరొకరు కీలక పాత్ర పోషించారని.. అతడి ద్వారా ప్రశ్నపత్రం ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచి బయ టకు వచ్చిందని సీఐడీ అధికారుల విచా రణలో వెల్లడైనట్టు తెలిసింది. ఈ నేపథ్యం లో ఆ నిందితుడు ఎవరు, ఎలా గుర్తించాలి, మిగతా బ్రోకర్లు ఎవరనే దానిపై దృష్టి పెట్టారు. ఇక ఢిల్లీ శివారులో ఉన్న సదరు ప్రింటింగ్‌ ప్రెస్‌ సిబ్బందిని సీఐడీ అధికారులు ఇప్పటికే నాలుగు సార్లు ప్రశ్నించారు. అయితే కమిలేష్‌ ఎవరో తమకు తెలియదని, అతడిని ఎప్పుడూ చూడలేదని వారు చెప్పడంతో ఎటూ తేలని పరిస్థితి నెలకొంది.

కేసులో అంతే సంగతులా?
ఈ కుంభకోణంలో గత ఏడు నెలల్లో ప్రధాన బ్రోకర్లు, బ్రోకర్లుగా మారిన తల్లిదండ్రులు, సాధారణ బ్రోకర్లు కలిపి 81 మందిని అరెస్టు చేసిన సీఐడీ... కీలక నిందితులను పట్టుకోవడంలో విఫలమైందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కమిలేష్‌ మృతితో ఈ కేసులో అసలు నిందితులు దొరకడం కష్టమేనని, దానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో... ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు అంశాలపై చార్జిషీట్లు దాఖలు చేయాలని సీఐడీ అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది. కీలక నిందితుల అరెస్టు తర్వాత అనుబంధ చార్జిషీట్లు దాఖలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని వార్తలు