క్లస్టర్‌ ఏర్పాటుకు రూ.2 కోట్లు

24 Aug, 2016 22:14 IST|Sakshi
జోగిపేటలో మాట్లాడుతున్న చంద్రమౌళి
  • ఖాదీ, గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ దక్షిణ భారత చైర్మన్‌ చంద్రమౌళి
  • జోగిపేట: స్వాతంత్ర్యం వచ్చి 70 సంవత్సరాలైనా గొల్లకుర్మలు వెనకబడే ఉన్నారని, ఖాదీ,  గ్రామీణ పరిశ్రమల కమిషన్‌ దక్షిణ భారత చైర్మెన్‌ చంద్రమౌళి అన్నారు. బుధవారం జోగిపేట ఉన్ని సహకార సంఘాన్ని పరిశీలించడానికి వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మధ్యదళారులవల్లే గొల్లకుర్మలు దోపిడీకి గురవుతున్నారన్నారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ స్థాయిలో ఉన్న సహకార సంఘాల అభ్యున్నతి కోసం  కృషి చేస్తోందన్నారు.

    జోగిపేట ఉన్ని సహకార సంఘానికి ఘన చరిత్ర ఉందని, దీనిని క్లస్టర్‌గా ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ.2 కోట్లు మంజూరు చేయిస్తానన్నారు. ఇందుకు గాను 25 శాతం నిధులు చెల్లించాల్సి ఉంటుందని  తెలిపారు. దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్‌లెట్లలో జోగిపేట ఉన్ని సంఘంలో నేసిన బ్లాంకెట్లను ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తానని హమీ ఇచ్చారు.

    ఘనంగా సన్మానం
    చంద్రమౌళి జోగిపేటకు చేరుకోగానే గొల్ల కుర్మలు డోలు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. హనుమాన్‌ చౌరస్తా, అంబేద్కర్‌ చౌరస్తాల మీదుగా సంఘం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. అనంతరం చంద్రమౌళి శాలువా పూలమాలలు, నేసిన గొంగడితో  ఘనంగా సన్మానించారు. 

    కార్యక్రమంలో ఖాదీ బోర్డు రాష్ర్ట డైరెక్టర్‌ ఆర్‌కే.చౌదరి, ఎక్జిటివ్‌ సభ్యులు ఎం. హరి, రాష్ర్ట బీజేపీ కార్యవర్గ సభ్యులు గోవర్దన్‌, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభాకర్‌గౌడ్‌, జోగిపేట  ఉన్ని సంఘం చైర్మెన్‌ కృష్ణ,య్య, కార్యదర్శి నారాయణ, మాజీ డైరెక్టర్‌ ఊస శ్రీశైలం, నాయకులు మల్లేశం, వెంకటేశం, పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఎర్రారం సతీష్‌ తదితరులు పాల్గొన్నారు.

    మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఖాదీబోర్డు చేయూత
    సంగారెడ్డి రూరల్: మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు ఖాదీ బోర్డు కృషి చేస్తుందని చంద్రమౌళి తెలిపారు. బుధవారం సంగారెడ్డి మండలం చెర్యాలలో నిర్వహించిన  అవగాహన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో నెలకొల్పే అన్ని రకాల గ్రామీణ పరిశ్రమలు, స్వయం ఉపాధి పథకాలకు ఖాదీ బోర్డు ద్వారా మహిళలకు 35 శాతం సబ్సిడీ ఆందజేయడం జరుగుతుందన్నారు. 

    రాష్ట్ర ఖాదీ బోర్డు అధికారి ఆర్‌కే చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోని మహిళలు లబ్ధిపొందాలని సూచించారు. అనంతరం జాతీయ కమిషన్‌ చైర్మెన్, తదితరులను గ్రామ సర్పంచ్‌ చంద్రకళ  , ఎంపీటీసీ కవిత  సన్మానించారు. సదస్సులో ఉప సర్పంచ్‌ శ్రీధర్, బిజెపి నాయకులు శివరాజ్‌తో పాటు గ్రామ స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు