దేశంలో ఖరీదైన సీఎం చంద్రబాబు

29 Oct, 2016 00:36 IST|Sakshi

వేంపల్లె : ఒకవైపు రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంది.. ఆర్థిక పరిస్థితి బాగా లేదంటూ రాజధాని నిర్మాణానికి ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తూ... మరోవైపు చేతికి ఎముకే లేనట్లు చంద్రబాబు విచ్చలవిడిగా ఖర్చు చేయడం శోచనీయమని కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్రెడ్డి తులసిరెడ్డి విమర్శించారు. వైఎస్సార్‌ జిల్లా వేంపల్లెలోని వ్యవసాయ కార్యాలయం వద్ద జరుగుతున్న విత్తన పంపిణీని తులసిరెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఏవో శ్రీవాణితో మాట్లాడారు. శనగ విత్తనాల పంపిణీ తీరును పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులందరికీ శనక విత్తనాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో మూడేళ్లుగా రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వలేక.. పేదలకు ఇళ్లు నిర్మించలేకపోతున్న చంద్రబాబు.. దుబారా ఖర్చులు పెట్టడంలో మాత్రం దేశంలోనే అత్యంత ఖరీదైన ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారన్నారు. సీఎం ఢిల్లీకి వెళ్లినప్పుడు ఉండటానికి ఏపీభవన్‌ ఉంది.. దీనికితోడు జనపథ్‌లో ఉన్న భవనం రిపేర్లకు రాష్ట్రప్రభుత్వం రూ.532 కోట్లు కేటాయించడం గర్హణీయమన్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి క్యాంపు ఆఫీసుకు లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్‌కు రూ.5కోట్లు.. వాటిమరమ్మతులకు రూ.1.30కోట్లు, విజయవాడలో క్యాంపు ఆఫీసు కోసం రూ.40 కోట్లు.. ప్రతి విమాన చార్జీలకు రూ.2కోట్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే కోట్లాది రూపాయల సొమ్ము దుబారా చేస్తున్నారని తెలిపారు.ఇకనైనా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలన్నారు. అనంతంర ఆయన తన స్వగృహంలో తన తండ్రి నర్రెడ్డి నారాయణరెడ్డి పదవ వర్ధంతి కార్యక్రమానికి హాజరై సతీమణి అలివేలమ్మతో కలిసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎన్‌ఎస్‌యూఐ జిల్లా అధ్యక్షుడు ధ్రువకుమార్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి సుబ్రమణ్యం, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, బీసీ నాయకులు ఉత్తన్న, సత్తార్‌ తదితరులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు