ఏపీఈపీడీసీఎల్‌ సీఎండీ ఆకస్మిక తనిఖీలు

12 Aug, 2016 22:52 IST|Sakshi
ఈపీడీసీఎల్‌ సీఎండీ ఆకస్మిక తనిఖీలు
సాక్షి, విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ(ఏపీఈపీడీసీఎల్‌) సీఎండీ ఎంఎం నాయక్‌ ఐదు జిల్లాలకు సేవలందిస్తున్న విశాఖలోని సెంట్రలైజ్డ్‌ కస్టమర్‌ కాల్‌సెంటర్‌ను శుక్రవారం సాయంత్రం ఆకస్మికంగా తనిఖీ చేశారు.సంస్థ పరి«ధిలోని ఉభయగోదావరి, ఉత్తరాంధ్ర జిల్లాల వినియోగదారుల నుంచి వస్తున్న విద్యుత్‌ సమస్యలను కాల్‌ సెంటర్‌ ఎగ్జిక్యూటివ్‌లు ఏ విధంగా రోజుకి ఎన్ని స్వీకరించి వాటిని ఎంత సమయంలో సంబంధిత సెక్షన్‌ కార్యాలయానికి చేరవేస్తున్నారు,అక్కడి వారు ఎంత వేగంగా వాటిని పరిష్కరిస్తున్నారనే అంశాలను సీఎండీ పరిశీలించారు. శుక్రవారం ఫిర్యాదు చేసిన తూర్పుగోదావరి జిల్లాకు చెందిన వినియోగదారుడికి సీఎండీ స్వయంగా ఫోన్‌చేశారు. సమస్య పరిష్కరించారా లేదా అని అడిగితెలుసుకున్నారు. పరిష్కారమయ్యిందని వినియోగదారుడు సమాధానమిచ్చారు. సీఎండీ స్వయంగా తనతో మాట్లాడటంతో వినియోగదారుడు ధన్యవాదాలు తెలిపారు. కాల్‌సెంటర్‌ను మరింత పటిష్టం చేసి, సెక్షన్‌ కార్యాలయాలతో సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ఏడీఈ స్థాయి అధికారిని నియమించాలని ఈ సందర్భంగా జనరల్‌ మేనేజర్‌ సి.శ్రీనివాసమూర్తిని సీఎండీ నాయక్‌ ఆదేశించారు.సంస్థ పరిధిలోని ఐదు జిల్లాల్లోని వినియోగదారులు విద్యుత్‌ సమస్యలను 1912కు ఫోన్‌ ద్వారా, ఆన్‌లైన్‌ ద్వారా కాల్‌సెంటర్‌కు తెలియజేసేలా వారిలో అవగాహన కల్పించాలని అధికారులకు, పట్టణ ప్రాంత వినియోగదారులకు ఫిర్యాదు చేసిన 4గంటల్లోనూ, గ్రామీణ ప్రాంతం వారు 12 గంటల్లోపు పరిష్కారం పొందవచ్చనే నమ్మకాన్ని కల్పించాలని కాల్‌సెంటర్‌ సిబ్బందికి సూచించారు. సీఎండీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి నాయక్‌ చేసిన కార్యక్రమం వినియోగదారుల సేవలకు సంబంధించింది కావడంతో ఆయన ప్రధాన్యతలేమిటో స్పష్టమైంది. 
మరిన్ని వార్తలు