కేరళలో ‘కొబ్బరి’ రోడ్లు!

16 Dec, 2016 02:26 IST|Sakshi
కేరళలో ‘కొబ్బరి’ రోడ్లు!

రోడ్ల నిర్మాణంలో కొబ్బరి ఉత్పత్తులు
కొబ్బరి పట్టాలతో     మట్టి కట్టలు
కాసులు కురిపిస్తున్న వైనం
ఏకంగా రూ.1,500 కోట్ల ఎగుమతులు
రెండేళ్లలో రెట్టింపు చేసే ప్రయత్నాలు


సాక్షి, హైదరాబాద్‌: కేరళ. ఈ పేరు వింటూనే టక్కున గుర్తొచ్చేది కొబ్బరి. ఎటు చూసినా దట్టంగా కొబ్బరిచెట్లతో కళకళలాడుతూ ఉంటుందా రాష్ట్రం. కొబ్బరితో పసందైన వంటలకు పెట్టింది పేరైన కేరళ ఇప్పుడు దాన్ని భారీగా ఆదాయం సమకూర్చి పెట్టే పరిశ్రమగా కూడా మార్చుకుంటోంది. అందులో భాగంగా ఏకంగా రోడ్ల నిర్మాణంలో కూడా ‘కొబ్బరి’ని వాడుతోంది! కాస్త ఆశ్చర్యంగా అనిపించినా ఇది వాస్తవమే. కొబ్బరి ఉత్పత్తులను రోడ్ల నిర్మాణంలో విరివిగా వాడుతోంది కేరళ ప్రభుత్వం. ఎంతగా అంటే, వాటిని విదేశాలకూ ఎగుమతి చేస్తూ భారీగా ఆదాయం పొందేంతగా! ప్రసుతం ఏటా దాదాపు రూ.1,500 కోట్ల విలువైన కొబ్బరి ఉత్పత్తులు రోడ్ల నిర్మాణం నిమిత్తం కేరళ నుంచి ఎగుమతి అవున్నాయి. ఈ ఆదాయాన్ని వచ్చే రెండేళ్లలో రెట్టింపు చేసే ప్రయత్నంలో ఉంది కేరళ!!

ఏం చేస్తారంటే...
రోడ్ల నిర్మాణంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. తారు, కాంక్రిట్‌ మిక్స్‌ మాత్రమే నాణ్యంగా ఉంటే చాలదు. రోడ్డు నిర్మాణానికి తోడ్పడే మట్టి కట్ట కూడా బలంగా ఉండాలి. ఏ మాత్రం తేడా వచ్చినా వాన నీటికి మట్టి జారిపోయి రోడ్డు కుంగిపోవటమో, భారీ కోతకు గురవడమో జరుగుతుంది. ఈ సమస్యకు కొబ్బరినే తిరుగులేని పరిష్కారంగా మార్చుకుంది కేరళ. రోడ్డు నిర్మాణం చేపట్టినప్పుడు ముందుగా ఎత్తుగా మట్టికట్ట వేసి దాని మీద తారో, కాంక్రిట్‌ మిక్సో వేస్తారు. ఆ కట్ట బలహీనపడకుండా కేరళ కొబ్బరి ఉత్పత్తులు కాపుకాస్తాయన్నమాట. అదెలాగంటే... మట్టికట్ట వేసేముందే దానికి రెండువైపులా కొబ్బరి నారతో చేసిన పట్టాలను పరుస్తారు. వాటిపై వట్టి వేర్లు, ప్రత్యేక రకం గడ్డి విత్తనాలు చల్లుతారు. వాటిపై వారం పాటు నీటిని పిచికారి చేస్తారు. తర్వాత దానిపై కొన్ని మట్టి పొరలు వేసి మిగతా రోడ్డు నిర్మాణాన్ని మామూలుగానే పూర్తి చేస్తారు. తర్వాత కొద్ది రోజుల్లోనే కొబ్బరి నార పట్టాల లోపలి నుంచి వట్టి వేర్లు, గడ్డి బయటకు చొచ్చుకుని వస్తాయి. వాటి వేర్లు మాత్రం లోలోపలికి బలంగా పాకిపోతాయి. అలా మట్టికట్టకు చక్కని పటుత్వం ఏర్పడుతుంది. నాలుగేళ్లలో కొబ్బరి నార పట్టాలు జీర్ణమై మట్టిలో కలిసిపోతాయి. వేర్లు మాత్రం మరింత బలంగా మారతాయి.



 ఈ పరిజ్ఞానం విదేశీయులను బాగా ఆకట్టుకుంది. ఎంతగా అంటే... ప్రస్తుతం జర్మనీ, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఇజ్రాయెల్‌ దేశాలకు కేరళ నుంచి భారీగా కొబ్బరి నార పట్టాలు ఎగుమతవు తున్నాయి. రోడ్డు వేసే ప్రాంతంలో ఉన్న నేల స్వభావం ఆధారంగా ఈ పట్టాల డిజైన్‌ కూడా పలు రకాలుగా ఉంటుంది!! ప్రస్తుతం కేరళలో ఏకంగా 90 కంపెనీలు ఈ పట్టాల తయారీలో నిమగ్నమయ్యాయి. ఇటీవల ఢిల్లీ, హర్యానా తదితర ప్రాంతాల్లో కూడా రోడ్ల నిర్మాణంలో ‘కేరళ’ పట్టాల వాడకం బాగా పెరిగింది. ఈ వ్యాపారాన్ని మరింత విస్తృతం చేయడమే లక్ష్యంగా, ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతున్న ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌లో కేరళకు చెందిన ‘చరన్‌కట్ట కాయర్‌’ కంపెనీ తన ఉత్పత్తులతో ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసింది.‘రోడ్ల నిర్మాణంలో మట్టికట్టలను పరిరక్షించేందుకు ప్రస్తుతం సింథటిక్‌ వస్తువులు అందుబాటులో ఉన్నా అవి పర్యావరణానికి హాని చేసేవి. అందుకే వాటి బదులు పర్యావరణహితమైన కొబ్బరి నార పట్టా విధానానికి ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోంది. మున్ముందు మా ఎగుమతులు బాగా పెరుగుతాయి. దీనికి భారత కాయర్‌ బోర్డు సహకారం కూడా బాగుంది’ అని చరన్‌కట్ట కాయర్‌ సంస్థ ప్రతినిధి అరుణ్‌ తెలిపారు.

పాపం పంచాయతీరాజ్‌!
సాధారణంగా ఎగ్జిబిషన్‌ స్టాల్‌లో ఉత్పత్తుల గురించి, తమ విజయాల గురించి తెలిపే పుస్తకాలు, ఫొటోలు ఏర్పాటు చేస్తారు. సందర్శకులకు వాటిని పంచిపెడతారు. అలాగే ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ ఎగ్జిబిషన్‌లో పంచాయితీరాజ్‌ శాఖ కూడా ఓ స్టాల్‌ ఏర్పాటు చేసింది. తెలంగాణలో పంచాయితీరాశ్‌ శాఖ విజయాలు, రోడ్ల నిర్మాణానికి సూచనలు, సలహాలు, అనుభవాలతో కూడిన పుస్తకాలు, బ్రోచర్లను ప్రత్యేకంగా ముద్రించింది. కానీ ప్రతిదానికీ కేవలం ఒక్కో కాపీని మాత్రమే స్టాల్‌లో ఉంచింది. సందర్శకులంతా తమకో కాపీ కావాలంటుండటంతో సిబ్బందికి పాలుపోవడం లేదు. ‘పై అధికారులు మాకు అదనపు పుస్తకాలు, బ్రోచర్లు ఇవ్వలేదు. డిస్‌ప్లే కోసం ఒక్కో ప్రతే ఇచ్చారు. దయచేసి చూసి వెళ్లండంతే’ అని బదులిస్తున్నారు. కానీ సందర్శకుల బాగా పెరగడంతో అందరికీ సమాధానం చెప్పలేక ‘పుస్తకాలు, ఇతర ప్రచురణలు కేవలం డిస్‌ప్లే కోసం మాత్రమే’ అని కాగితాలపై రాసి స్టాల్‌ చుట్టూ అంటించారు!

మరిన్ని వార్తలు