మంత్రి పేరుతో దందా

5 Mar, 2017 23:07 IST|Sakshi
కాంట్రాక్టులు ఇస్తానని వసూళ్లు 
రంపచోడవరం : రాష్ట్ర మంత్రిపేరుతో ఇంజినీరింగ్‌ శాఖ అధికారులను, సిబ్బందిని బెదిరించి దందాకు పాల్పడ్డాడు ఓ వ్యక్తి. సదరు మంత్రి వద్ద తనకు ఎంతో పలుకుబడి ఉందని పర్సంటేజీలు ఇస్తే ఇంజినీరింగ్‌ పనులు మంజూరు చేస్తానని ఆ వ్యక్తి వసూళ్లకు తెగబడుతున్నాడు. రంపచోడవరంలో ఒక ప్రభుత్వ అతిథి గృహాన్ని అడ్డాగా చేసుకుని ఆయన తన కార్యకలాపాలు సాగిస్తున్నాడు. అతడి వద్దకే జేఈ స్థాయి నుంచి డీఈ స్థాయి వరకు ఇంజినీర్లు వెళ్లి మాట్లాడి వస్తున్నారంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో ఆ వ్యక్తి ఇంజినీరింగ్‌ ఉన్నతాధికారి గదిలోనే కూర్చుని ఉపాధి హామీ ప్రత్యేక ప్రాజెక్టు పనుల విషయమై కాంట్రాక్టర్లతో మాట్లాడేవాడంటే ఆయనకు ఆయా అధికారులతో ఎంత పరిచయాలు ఉన్నాయో తెలుస్తోంది. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయంలో కూడా ఆయన మంత్రి పేరుతో రంపచోడవరంలో తిష్టవేసి చక్రం తిప్పాడు. అతడి దందాపై ‘మంత్రి బంధువువైతే ఓకే’ పేరుతో వచ్చిన కథనంతో రంపచోడవరం వదిలి వెళ్లిపోయాడు. తాజాగా సదరు వ్యక్తి ఉంటున్న ప్రభుత్వ భవనంలోకి శనివారం రాత్రి స్థానిక పోలీసులు వెళ్లి అతడిని స్టేషన్‌కు తీసుకువచ్చారు. అతడితో పాటు అక్కడే ఒక జేఈ ఉండడం విశేషం. అసలు ఏ హోదాతో అతడికి ప్రభుత్వ అతిథి గృహాన్ని కేటాయించారనే చర్చ జరుగుతోంది. ప్రభుత్వ అతిథి గృహంలో ప్రైవేట్‌ వ్యక్తి ఎందుకు ఉన్నాడు? అనే దానిపై ఉన్నతాధికారుల నుంచి సమాచారం రావడంతో పోలీసులు ఆ భవనానికి వెళ్లారు. తాజాగా జరిగిన సంఘటనతో అతడి వల్ల మోసపోయిన చోటా మోటా కాంట్రాక్టర్‌లు కేసులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అసలు ఏజెన్సీకి సంబంధం లేని వ్యక్తి ఇంజనీరింగ్‌ శాఖలోని కొంత మందితో సంబంధాలు పెట్టుకుని ఈ దందాలకు తెగబడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలో ఉపాధి హామీ పథకంలో చేసి వర్క్‌ల్లో ఫైనల్‌ బిల్లులు విషయంలో కూడా సదరు వ్యక్తి చక్రం తిప్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. పనులను పర్యవేక్షించి నివేదికలు ఇవ్వాల్సిన క్వాలిటి కంట్రోల్‌ అధికారులను సైతం మేనేజ్‌ చేయగలనని చెప్పుకోవడం వెనుక ఎవరి హస్తం ఉందో అర్థం కావడం లేదు. ఇలాంటి వ్యవహారాలపై నిగ్గు తేలాలంటే ఉన్నతాధికారులు జోక్యం చేసుకోవాల్సిందే. 
 
మరిన్ని వార్తలు