కలెక్టర్ కారులో తరలించినా ప్రాణం దక్కలేదు

10 Feb, 2016 21:33 IST|Sakshi
కలెక్టర్ కారులో తరలించినా ప్రాణం దక్కలేదు

రామాయంపేట: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి.. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ యువకుడిని ఆదుకునేందుకు నిజామాద్ జిల్లా కలెక్టర్ ముందుకొచ్చారు. ప్రమాదస్థలం నుంచి బాధితుడిని తన వాహనంలో ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆ యువకుడు ప్రాణాలు వదలడంతో ఆమె చేసిన సాయం ఫలించలేదు. ఈ సంఘటన బుధవారం రాత్రి మెదక్ జిల్లా రామాయంపేట పట్టణ శివారులో జరిగింది. ఎస్‌ఐ నాగార్జునగౌడ్ కథనం మేరకు.. హైదరాబాద్‌లోని మెడ్లీ ఫార్మసీలో ఏరియా మేనేజర్లుగా పనిచేస్తున్న రామకృష్ణ భరద్వాజ్, గంగల్ల నరేశ్‌కుమార్ బైక్‌పై కామారెడ్డి నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు.

రామాయంపేట శివారులో వీరి బైక్ ముందు వెళ్తున్న ఆటోను ఢీకొట్టి అదుపుతప్పి పడిపోయింది. బైక్‌పై ఉన్న ఇద్దరూ కిందపడిపోయారు. వీరిలో రామకృష్ణ భరద్వాజ్ (30)కు తీవ్ర గాయాలయ్యాయి. సకాలంలో 108 రాకపోవడంతో నరేశ్‌కుమార్ రోడ్డుకు అడ్డంగా నిలబడి పలువుర్ని సాయం కోరాడు. ఎవరూ స్పందించలేదు. అదే సమయంలో కారులో హైదరాబాద్ వెళ్తున్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ యోగిత రాణా తన కారులో క్షతగాత్రుడిని ఎక్కించుకుని నార్సింగిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే రామకృష్ణ మృతి చెందాడు. నరేశ్‌కుమార్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు