నెపం అధికారుల పైనా?

26 May, 2016 09:37 IST|Sakshi

- ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై కలెక్టర్ల ఆగ్రహం
అధికారులు అవినీతిపరులున్న అభిప్రాయం ఉందన్న సీఎం

 సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: తన అవినీతి, అక్రమార్జనను కప్పిపుచ్చుకుంటూ ఇతరులను వేలెత్తి చూపడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బహు నేర్పరి అనే విషయం మరోసారి రుజువైంది. ఆయన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే రూ.లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాబు అవినీతి వ్యవహారాలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ‘అవినీతి చక్రవర్తి చంద్రబాబు’ పేరిట ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ముద్రించిన పుస్తకం దేశవిదేశాల్లో ఇప్పటికే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే, అవినీతికి అధికారులే కారణమన్న అభిప్రాయాన్ని చంద్రబాబు తాజాగా వ్యక్తం చేయడం గమనార్హం.

ఆయన తన అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకుంటూ నెపాన్ని అధికారులపై వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. విజయవాడలో బుధవారం ప్రారంభించిన రెండు రోజుల కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. రెండేళ్లలో ప్రజలకు అవసరమైన ఫైళ్లపై కాకుండా కిందిస్థాయిలో ఎవరికో అవసరమైన ఫైళ్లపైనే తాను సంతకాలు చేశానని చెప్పారు. ఎవరైతే ఫైల్ వెంటపడతారో(లాబీయింగ్ చేస్తారో) వారి ఫైళ్లు మాత్రం క్లియర్ అవుతున్నాయని, అలా వెంటపడని వారి ఫైళ్లు ఎక్కడో ఉండిపోతున్నాయని అన్నారు. కొన్ని శాఖలపై ప్రగాఢమైన అవినీతి ముద్ర ఉందని, అధికార యంత్రాంగం బాధ్యత లేకుండా పనిచేస్తున్నారనే భావన ఉందని, అధికారులు అవినీతిపరులనే అభిప్రాయం జనంలో ఏర్పడిందని భాష్యం చెప్పారు. తమను అవినీతిపరులుగా చిత్రీకరిస్తూ మాట్లాడిన చంద్రబాబు తీరుపట్ల కలెక్టర్లు, అధికారులు మండిపడుతున్నారు.

మరిన్ని వార్తలు