600 హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు

11 Apr, 2017 10:38 IST|Sakshi
600 హామీల్లో ఏ ఒక్కటీ అమలు కాలేదు

► మ్యానిఫెస్టోలోని హామీలను విస్మరించిన టీడీపీ
► హామీల అమలు చేసి రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల గుండెల్లో నిలిచారు
► బీజేపీ, టీడీపీ నవ్యాంధ్రప్రదేశ్‌ ప్రజలను వంచించారు
► ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం


ఒంగోలు సబర్బన్‌: ఎన్నికల సమయంలో టీడీపీ ఇచ్చిన 600 హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయలేదని కాంగ్రెస్‌ పార్టీ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలులో ప్రజా బ్యాలెట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని ప్రజా బ్యాలెట్‌ ద్వారా వెల్లడి చేయడానికి ఒంగోలు నగరంలోని ప్రధాన రోడ్లపై పర్యటించారు. జైరామ్‌ సెంటర్‌లో ప్రారంభమైన ప్రజా బ్యాలెట్‌ కార్యక్రమం గాంధీ రోడ్డు, ట్రంక్‌ రోడ్డు, ప్రకాశం భవన్, నెల్లూరు బస్టాండ్‌ వరకూ నిర్వహించారు.

అనంతరం జేడీ శీలం మాట్లాడుతూ  టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు 2014 ఎన్నికల సమయంలో 600 హామీలను తన మ్యానిఫెస్టోలో పొందుపరిచారని, అధికారంలోకి వచ్చి మూడేళ్లు కావస్తున్నా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. టీడీపీ మ్యానిఫెస్టోనే ఒక మోసపూరితమైందని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌.రాజశేఖరరెడ్డి రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారని కీర్తించారు.

ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో రాజశేఖరరెడ్డి ఆయనకు ఆయనే సాటి అని కొనియాడారు. నూతనంగా ఏర్పాటైన నవ్యాంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని టీడీపీలు అభివృద్ధి నిరోధకులుగా మారారని దుయ్యబట్టారు. పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాటను గాలికొదిలేసిన ఘనత ప్రధాని మోదీదని ఎద్దేవా చేశారు. ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత నిధులు రాబట్టారో ముఖ్యమంత్రి చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. డీసీసీ అధ్యక్షుడు ఈ.సుధాకరరెడ్డి,  ఏఐసీసీ డి మానిటైజేషన్‌ జిల్లా చైర్మన్‌ బైరబోయిన చంద్రశేఖర్‌ యాదవ్, ఒంగోలు నగర కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు శ్రీపతి ప్రకాశం, నియోజవర్గ ఇన్‌చార్జ్‌లు డాక్టర్‌ గుర్రాల రాజ్‌విమల్, షేక్‌ సైదా, పాశం వెంకటేశ్వర్లు, ఎస్‌కె.రసూల్, గాదె లక్ష్మారెడ్డి, యాదాల రాజశేఖర్‌తోపాటు పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా