‘గ్రిడ్’ గుట్టు బయటపెడతాం

19 Oct, 2015 00:52 IST|Sakshi
‘గ్రిడ్’ గుట్టు బయటపెడతాం

♦ ఈ అక్రమాలను త్వరలో మీడియా ముందుంచుతాం
♦ సర్కారుపై నిప్పులు చెరిగిన కాంగ్రెస్ నేతలు
 
 సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: వాటర్ గ్రిడ్‌లో జరుగుతున్న అవినీతి, అక్రమాలను బట్టబయలు చేస్తామని, ఆ వివరాలను త్వరలో మీడియా ముందు ఉంచుతామని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్రతిపక్షాలు గ్రిడ్ గురించి మాట్లాడితే ప్రభుత్వ పెద్దలు ఉలిక్కిపడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతు భరోసా యాత్ర ఆదివారం ఆదిలాబాద్ జిల్లాలో సాగింది. ఈ సందర్భంగా ఇచ్చోడ మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడారు. వాటర్ గ్రిడ్ డీపీఆర్ (డిటైల్ ప్రాజెక్టు రిపోర్టు)ను ప్రభుత్వం ఎందుకు బహిర్గతం చేయడం లేదని ఉత్తమ్ ప్రశ్నించారు.

ఆంధ్ర పాలకులని విమర్శించిన టీఆర్‌ఎస్ పార్టీ ఈ గ్రిడ్ పనులను ఆంధ్ర కంపెనీకే అప్పగిస్తోందని, ఈ పనులు చేస్తున్న కాంట్రాక్టు కంపెనీ ఎవరిదో తెలపాలని డిమాండ్ చేశారు. పాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని పలుమార్లు డిమాండ్ చేసిన టీఆర్‌ఎస్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు డిజైన్‌లు మార్చుతూ తెలంగాణలోని 16లక్షల ఎకరాల ఆయకట్టును ప్రశ్నార్థకంగా మార్చుతున్నారని విమర్శించారు. నిత్యం పదుల సంఖ్యలో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక్క బాధిత కుటుంబాన్నైనా పరామర్శించకపోవడం దారుణమన్నారు. బాధిత కుటుంబాలకు పరిహారం చెల్లించడం లేదన్నారు. జైపూర్ పవర్ ప్లాంటును తమ ప్రభుత్వమే మంజూరు చేసిందని గుర్తు చేశారు.

 వారు ప్రభుత్వ పందులు
 రైతు భరోసా యాత్ర చేపట్టిన కాంగ్రెస్ నాయకులను రాబందులంటూ విమర్శించిన టీఆర్‌ఎస్ మంత్రులే ప్రభుత్వ పందులని కాంగ్రెస్ పార్టీ శాసన సభాపక్ష నేత కె.జానారెడ్డి విమర్శించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగా ధాన్యం ధర క్వింటాల్‌కు రూ.1,450 చొప్పున కొనుగోలు చేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారని అన్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలను ప్రభుత్వం గొంతునొక్కే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన అభివృద్ధి పునాదులపై నిలబడి ప్రదర్శనలిస్తున్నారని అభివర్ణించారు.

 ‘ప్రాణహిత’ను నిర్వీర్యం చేసేందుకే..
 వాటర్‌గ్రిడ్ పైపుల కంపెనీకి మార్కెటింగ్ చేసేందుకే మంత్రి కేటీఆర్ యూపీ వెళ్లి అక్కడి సీఎంను కలిశారని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ భట్టి విక్రమార్క ఆరోపించారు. ఈ పనులు చేయనున్న కాంట్రాక్టు కంపెనీలకు కేటీఆర్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఒకవేళ వాటర్‌గ్రిడ్ ఆదర్శవంతమైన ప్రాజెక్టే అయితే యూపీ సీఎం అఖిలేష్ యాదవ్ స్వయంగా తెలంగాణకు వచ్చి పరిశీలించాలే గానీ, ఎలాంటి ప్రయోజనం లేని యూపీ సీఎంను కలిసేందుకు ప్రత్యేక విమానంలో మందీ మార్భలంతో వెళ్లాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. వాటర్‌గ్రిడ్‌లో ముడుపుల కోసమే ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును నిర్వీర్యం చేస్తోందని విమర్శించారు.

వాస్తు పండితుల మాటలు వినే కేసీఆర్ కరువు మండలాలను ప్రకటించడం లేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ఎద్దేవా చేశారు. ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్ల అమలు చేసేందుకు కమిటీలతో పనిలేదని, కమిషన్ వేయాలని డిమాండ్ చేశారు. శాసనసభా పక్ష ఉపనేత జీవన్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయ నిధిపై సీఐడీ విచారణ చేపట్టిందంటే ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయమే అవినీతికి నిలయంగా మారిందని ఆరోపించారు. రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు, రాష్ట్ర నాయకులు రాంరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఆకుల లలిత, జి.వినోద్, కోదండరెడ్డి, నర్సారెడ్డి, సి.రాంచెంద్రారెడ్డి పాల్గొని ప్రసంగించారు.

>
మరిన్ని వార్తలు