‘పార్టీకి పట్టిన శని వదిలింది’

26 Apr, 2016 02:07 IST|Sakshi
‘పార్టీకి పట్టిన శని వదిలింది’

ఫారూక్ వెళ్లడంతో కాంగ్రెస్‌లో సంబరాలు
చిన్నకోడూరు: ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరడంతో  కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం చిన్నకోడూరులో  సంబురాలు జరుపుకున్నారు. టపాసులు కాల్చి, మిఠాయిలు పంచుకున్నారు. ఫారూఖ్ హుస్సేన్ కాంగ్రెస్ పార్టీని వీడడంతో సిద్దిపేట నియోజకవర్గానికి పట్టిన గ్రహణం వీడి మంచి రోజులు రానున్నాయన్నారు. ఫారూఖ్ 30 ఏళ్లుగా పార్టీ పదవులు అనుభవించి ఏనాడూ పార్టీ అభ్యున్నతికి గాని, కార్యకర్తలకు అండగా కానీ నిలవలేదన్నారు.

నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఫారూఖ్ భ్రష్టుపట్టించాడన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు విధేయుడిగా పనిచేశాడన్నారు. ఇక సిద్దిపేట ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం వస్తుందనే ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డీసీసీ ప్రధాన కార్యదర్శి మీసం నాగరాజు, నంగునూరు మంండల పార్టీ అధ్యక్షులు, సర్పంచ్ దేవులపల్లి యాదగిరి, నాయకులు కొర్రి శంకర్, మహేందర్, ప్రవీణ్, పర్శరాములు, రాజు తదితరులు ఉన్నారు.

 శని వదిలింది..
దుబ్బాక : కాంగ్రెస్ ఆధినేత్రి సోనియా గాంధీ పెట్టిన భిక్షతో ఉన్నత పదవులు పొందిన ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ పార్టీలో ఉన్నన్ని రోజులు టీఆర్‌ఎస్‌కు కోవర్ట్‌గా పని చేశారని, ఆయన టీఆర్‌ఎస్‌లో చేరడంతోనే కాంగ్రెస్‌కు పట్టిన శని వదిలిందని డీసీసీ ఉపాధ్యక్షుడు కటిక బాల్‌రాజు అన్నారు.

  సోమవారం ఆయన దుబ్బాకలో విలేకరులతో మాట్లాడుతూ తన రక్తంలో కాంగ్రెస్ రక్తమే ప్రవహిస్తోందని, చచ్చినా బతికినా కాంగ్రెస్‌లోనే ఉంటానని ప్రగల్భాలు పలికిన ఫారూఖ్ ఇప్పుడెందుకు పార్టీని వీడారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.  కాంగ్రెస్ నుంచి బహిష్కరిస్తారనే ముందస్తు సమాచారంతోనే ఆయన కాంగ్రెస్‌ను వీడి గులాబీ కండువా కప్పుకున్నారని విమర్శించారు. అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టడం ఫారూఖ్‌కు వెన్నతో పెట్టిన విద్య అన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా