‘పాలమూరు’ అగ్రిమెంట్లకు సీఓటీ ఓకే

6 Apr, 2016 03:29 IST|Sakshi
‘పాలమూరు’ అగ్రిమెంట్లకు సీఓటీ ఓకే

సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో టెండర్లు దక్కించుకున్న ఏజెన్సీల అర్హతలకు కమిషనర్ ఆఫ్ టెండర్ (సీఓటీ) ఆమోదంతెలిపింది. పనులు దక్కించుకున్న ఏజెన్సీలకు నిబంధనల మేర అన్ని అర్హతలున్న దృష్ట్యా, వారితో ఒప్పందాలకు ముందుకు వెళ్లవచ్చునని నిర్ణయించింది. అయితే అధికారికంగా మినిట్స్‌పై సీఓటీ అధికారులు సంతకాలు చేసి ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్‌కు పంపాలి. అక్కడ ఆమోదం అనంతరం ఏజెన్సీలతో ఒప్పందాలు జరిగి పనులు ఆరంభమవుతాయి.

మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లోని 62 మండలాల 1,131 గ్రామాల పరిధిలో 10 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే ఉద్దేశంతో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు చేపట్టారు. దీని అంచనా వ్యయం రూ.35,200 కోట్లు. రంగారెడ్డిలో నిర్మించే కేపీ లక్ష్మీదేవునిపల్లి మినహా ప్రాజెక్టులోని ఐదు రిజర్వాయర్లు, వాటికి అనుసంధానంగా నిర్మించే టన్నెల్, కాల్వల పనులను మొత్తం 18 ప్యాకేజీలుగా విభజించి రూ.29,924.78 కోట్ల పనులకు టెండర్లు పిలిచిన విషయం తెలిసిందే. వీటిని గత నెల 11న తెరవగా ప్రముఖ కంపెనీలు పనులు దక్కించుకున్నాయి.

>
మరిన్ని వార్తలు