పత్తి రైతుల పరేషాన్‌

12 Dec, 2016 23:10 IST|Sakshi
పత్తి రైతుల పరేషాన్‌

- కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు
- నోట్ల రద్దుతో రెట్టింపైన కష్టాలు
- పంట విక్రయించినా సకాలంలో చేతికందని డబ్బు
- సగానికి పడిపోయిన దిగుబడి

రాయికోడ్‌ : ఆరుగాలం కష్టనష్టాలకు ఓర్చి రైతులు పండించిన పత్తి పంటను అమ్ముకోవడానికి స్థానికంగా విక్రయ కేంద్రాలు లేకపోవడంతో అవస్థలు పడుతున్నారు. వరుస ప్రకృతి వైపరిత్యాలతో సాగు చేస్తున్న పత్తి పంటతో రైతులు నష్టాలను చవిచూస్తున్నారు. ఏం చేయాలో పాలుపోక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ ప్రారంభంలో మురిపించిన వర్షాలతో మండలంలో 20 వేల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. జూలై, ఆగష్టు మాసాల్లో వర్షాలు లేక పత్తి పంట ఎదుగుదలపై ప్రభావం పడింది. అనంతరం సెప్టెంబర్, అక్టోబర్‌ మాసాల్లో పత్తి పూత, కాత దశలో ఉండగా కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో పత్తి పంట దెబ్బతింది. మండలంలోని రాయికోడ్, సింగితం, కర్చల్, ఇందూర్, నాగ్వార్, కుసునూర్, ధర్మాపూర్, యూసుఫ్‌పూర్, రాయిపల్లి తదితర గ్రామాల్లో పత్తి పంట దెబ్బతింది.

గత నెల రోజులుగా మండలంలో పత్తితీత పనులు ప్రారంభమయ్యాయి. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడిని ఆశించిన రైతులకు నిరాశే ఎదురైంది. వర్షాలతో పంట దెబ్బతిన్న కారణంగా ఎకరాకు 4, 5 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వస్తోందని రైతులు చెబుతున్నారు. వచ్చిన కాస్త దిగుబడి పెట్టుబడులకే సరిపడేలా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మూడుసార్లు పత్తితీత కొనసాగుతుందని, ఈ ఏడాది ఒక దఫాలోనే పత్తితీత పూర్తవుతోందని వాపోతున్నారు. ఈ ఏడాది కూడా పత్తి దిగుబడి సగానికి పడిపోయిందని పేర్కొంటున్నారు.

కొనుగోలు కేంద్రాలు లేక అవస్థలు
ఆశించిన దిగుబడి రాక నష్టాల్లో ఉన్న పత్తి రైతులకు స్థానికంగా పత్తి కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు రెట్టింపయ్యాయి. మరోవైపు క్వింటాల్‌ పత్తి ధర ప్రస్తుతం రూ.4,500 మాత్రమే పలుకుతోంది. ఎకరాకు రూ.20 వేలకు పైగానే పెట్టుబడులు వెచ్చించామని, వచ్చే దిగుబడి, మద్దతు ధర సంతృప్తికరంగా లేదని రైతులు వివరిస్తున్నారు. స్థానికంగా కొనుగోలు లేక సుదూరంలోని కొనుగోలు కేంద్రాలకు పత్తిని తరలిస్తున్నామని, దీంతో ప్రయాణచార్జీలు అధికమై నష్టపోతున్నామని చెబుతున్నారు. మండలంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని నాలుగేళ్లుగా కోరుతున్నా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికారుల నిర్లక్ష్యం కారణంగా పత్తిని దళారులకు విక్రయించుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. పెద్ద నోట్ల రద్దుతో విక్రయించిన పత్తికి డబ్బు పొందడం గగనంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారులు, దళారులు తమకు చెక్కులు ఇవ్వడంతో సకాలంలో డబ్బు చేతి కందడంలేదని అంటున్నారు. మద్దతు ధర లేకపోవడం, పెద్దనోట్ల రద్దు, స్థానికంగా కొనుగోలు కేంద్రం లేకపోవడంతో కొందరు రైతులు ఇళ్లల్లో నిల్వ ఉంచుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి స్థానికంగా పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు