దూదిపువ్వు దుఃఖం

3 Nov, 2015 00:49 IST|Sakshi
దూదిపువ్వు దుఃఖం

♦ పత్తి రైతు కన్నీళ్ల సాగు
♦ దిగుబడి రాక.. గిట్టుబాటు లేక విలవిల
♦ ఎకరాకు రూ.30 వేల పెట్టుబడి.. ఆదాయం మాత్రం 15 వేల లోపే
♦ మార్కెట్‌కు వెళ్తే మద్దతు కరువు.. దగా చేస్తున్న వ్యాపారులు
♦ వానల్లేక చేతికందకుండా పోయిన 60% పంట
♦ 10 వేల కోట్ల మేర నష్టం
♦ ఆత్మహత్య చేసుకుంటున్న వారిలో 60% మంది పత్తి రైతులే
 
 కరుణ లేని వరుణుడు కాటేశాడు..
 ఊరించిన చినుకు ముఖం చాటేసింది.. అప్పుల నేలపై చిగురించిన మొక్కకు కన్నీళ్లే నీళ్లయ్యాయి.. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు ‘దళారీ’ చీడ పట్టింది.. అటు ప్రకృతి నుంచి ఇటు ప్రభుత్వం దాకా ఎవరి ‘మద్దతు’ లేక రైతన్న బతుకులు తెల్లారిపోయాయి! తమ జీవితాలను బంగారం చేస్తుందనుకున్న ‘తెల్ల బంగారం’ రైతుల బతుకులను నిలువునా కూల్చింది. ఓ అంచనా ప్రకారం రాష్ట్రంలో ఇప్పటిదాకా 1,640 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. అందులో దాదాపు 984 మంది (60%) పత్తి రైతులే ఉండడం వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతోంది.
 
 పెట్టుబడులు నేలపాలు
 తెలంగాణలో ఈసారి రైతులు రికార్డు స్థాయిలో పత్తి సాగు చే శారు. వరి విస్తీర్ణానికి మూడు రెట్లు అధికంగా సాగైంది. ఖరీఫ్‌లో 14.2 లక్షల ఎకరాల్లో వరి సాగు (54%) కాగా... పత్తి 41.95 లక్షల ఎకరాల్లో (103%) సాగైంది. జూన్ నెలలో రుతు పవనాలు చురుగ్గా ఉండటంతో భారీ వర్షాలు కురిశాయి. పరిస్థితి ఆశాజనకంగా ఉండటంతో రైతులు పత్తి వైపు మొగ్గుచూపారు. కానీ ఆ తర్వాత జూలై, ఆగస్టులో వాన చినుకు రాక వేసిన పత్తి ఎండిపోయింది. ఒక అంచనా ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా 60 శాతం పైగా పత్తి ఎండిపోయింది. మహబూబ్‌నగర్ జిల్లాలోనైతే 90 శాతానికి పైగా పత్తి చేతికందకుండా పోయింది.

మెదక్, రంగారెడ్డి జిల్లాల్లోనూ అదే పరిస్థితి. ఒక్కో ఎకరానికి రైతు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకూ పత్తిపై పెట్టుబడి పెడుతుండగా.. ఆదాయం మాత్రం రూ.15 వేల లోపే ఉంటోంది. పంట ఎండిన చోట పెట్టుబడులన్నీ నేలపాలయ్యాయి. కాస్త చేతికందిన చోట దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా పంట బాగుంటే పత్తి దిగుబడి ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు రావాలి. కానీ ప్రస్తుతం 3 నుంచి 5 క్వింటాళ్లకు మించి రాలేదు.
 
 అప్పుల పాలవుతున్నాం...
 
ఈయన పేరు చెరుకుమల్ల రామారావు. ఖమ్మం జిల్లా కారేపల్లి. నాలుగెకరాల్లో పత్తిసాగుకు ఎకరానికి రూ.25 వేల చొప్పున అప్పు తెచ్చి పెట్టుబడి పెట్టాడు. కానీ ఎకరానికి ఆరు క్వింటాళ్లే దిగుబడి వచ్చింది. ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.3,500 ఇస్తామంటున్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర  ఇస్తేనే కొంతయినా అప్పులు తీరుతాయని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు.
 
 తెగులుతో పంట నాశనమైంది..
 ఈ రైతుల పేరు వెంకటేశ్వర్లు. ఖమ్మం జిల్లా కారేపల్లి. తనకున్న 3 ఎకరాల్లో పత్తి పంట సాగు చేస్తే.. పంటకు ఎండు తెగులు సోకి నాశనమై పోయింది. ఎకరాకి రూ.25 వేల చొప్పున పెట్టుబడి పెట్టి పంట సాగుచేస్తే.. వర్షాభావ పరిస్థితులు వచ్చి పంటకు ఎండు తెగులు సోకింది. కొద్దో గొప్పో కాసిన కాయలను కోతుల మందలు కొరికి పడేశాయి. 3 ఎకరాల్లో 9 క్వింటాళ్ల పత్తి వచ్చింది. తేమ శాతం పేరుతో ప్రైవేట్ వ్యాపారులు క్వింటాలుకు రూ.3,200 ధర పెట్టారు.
 
 ఆస్తి అమ్మినా అప్పులు తీరవు..
 మేం నలుగురు ఆడపిల్లలం. నేను పెద్ద కూతుర్ని. మా నాన్నకు కొడుకులు లేక నన్ను పుట్టింట్లోనే ఉండమన్నారు. పెళ్లయి 20 ఏళ్లయినా పొలంలోనే పనిచేసుకుంటూ వచ్చాను. పంటలు సరిగా పండక మా నాన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆస్తి మొత్తం అమ్మినా అప్పులు తీరవు. ఎలా బతకాలో అర్థం కావడం లేదు.
 పి. భాగ్యమ్మ, యాపదిన్నె, అయిజ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా
 
 మద్దతు ఏదీ?
 ప్రస్తుతం 50 శాతానికి పైగా పత్తి కొనుగోళ్లు జరిగాయి. కానీ రైతులెవరికీ కనీస మద్దతు ధర రాలేదు. సీసీఐ కొనుగోళ్లు కూడా అరకొరగానే జరిగాయి. సర్కారు ప్రకటించిన మద్దతు ధర రూ.4,100 కాగా.. రైతులకు రూ.3,500కు మించి ఇవ్వడం లేదు. అటు పంటలు ఎండడం, ఇటు అరకొర దిగుబడులు, మరోవైపు మద్దతు ధర అందక మూడు విధాలా రైతు చిత్తయ్యాడు. పంటలు ఎండడం, పెట్టుబడులు నేలపాలవడం, దళారుల చేతిలో మోసపోవడంతో రైతులు మొత్తమ్మీద రూ.10 వేల కోట్ల మేరకు నష్టపోయారు.
 
 ఆత్మహత్యల్లో పత్తి రైతులే ఎక్కువ
 ఈ ఏడాది సాగైన అన్ని పంటల విస్తీర్ణం 86.65 లక్షల ఎకరాలు. అందులో పత్తి 41.95 లక్షల ఎకరాల్లో (48.41%) సాగైంది. మొత్తం 55.52 లక్షల మంది రైతులు అన్ని పంటల సాగులో పాలు పంచుకుంటుంటే.. అందులో పత్తి రైతులు దాదాపు 26.56 లక్షల మంది ఉన్నారు. వారిలో 85 శాతం మంది సన్నచిన్నకారు రైతులే. పంట కోసం భారీగా పెట్టుబడులు పెట్టడం, కొందరు రెండుమూడు సార్లు బోర్లు బావులు తవ్వించడం, బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో పెద్దఎత్తున రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించారు. అప్పులు కట్టలేక కుదేలయ్యారు. సోమవారం నాటికి రైతు సంఘాలు వేసిన లెక్కల ప్రకారం రాష్ట్రంలో 1,640 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే.. అందులో దాదాపు 984 మంది పత్తి రైతులేనని సమాచారం.
 
 స్వామినాథన్ సిఫార్సులేమయ్యాయి?
 స్వామినాథన్ సిఫార్సులను పదే పదే ప్రస్తావించే పాలకులు వాటి  అమలుకు మాత్రం ముందుకు రావడం లేదు. స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం.. రైతు పెట్టిన ఉత్పత్తి ఖర్చు (పెట్టుబడి), ఆ ఉత్పత్తి ఖర్చులో సగం.. ఈ  రెండింటినీ కలిపి కనీస మద్దతు ధరగా ప్రకటించాలి. ఆ ప్రకారం చూస్తే అధికారిక లెక్కల ప్రకారం క్వింటాలు పత్తికి రైతు పెట్టే ఉత్పతి ఖర్చు రూ. 5,200. అం దులో సగం రూ.2,600. ఈ రెం డింటినీ కలిపితే రూ.7,800. ఇదే పత్తి కనీస మద్దతు ధర కావాలి. కానీ కేంద్రం దాన్ని పట్టించుకోలేదు. అందులో సగం ధరకు కూడా వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. వైఎస్ తన హయాంలో వ్యాపారులు పత్తిని క్వింటాలుకు రూ.7,200 కొనుగోలు చేశారు. ఇన్నేళ్లు గడిచినా ఆ ధర కాదు కదా.. రైతుకు కనీస మద్దతు ధరా గగనమవుతోంది.

మరిన్ని వార్తలు