పత్తి@రూ.5,425

8 Jan, 2017 22:32 IST|Sakshi
పత్తి@రూ.5,425

►  నిర్మల్‌ మార్కెట్లో రికార్డు ధర
►ఈ సీజన్ లో అదే అత్యధికం!
► క్యాండీ, సీడ్‌ ధరలు అమాంతం  పెరగడంతోనే..
► అన్నదాతల్లో ఆనందం


సాక్షి, నిర్మల్‌ : ఈ ఏడాది పత్తి కొనుగోలు సీజన్ లో నిర్మల్‌ మార్కెట్లో రికార్డు ధర నమోదైంది. శనివారం ఈ మార్కెట్లో క్వింటాల్‌ పత్తికి రూ.5,425 ధర పలికింది. వారం రోజుల కిందటి వరకు రూ.5,100 నుంచి రూ.5,200 పలుకగా రెండు రోజులుగా రూ.5,400 పైబడి వెచ్చించి ట్రేడర్స్‌ కొనుగోలు చేస్తుండడం గమనార్హం. భైంసా మార్కెట్లో శనివారం రూ.5,400 పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో క్యాండీ(365 కిలోల దూది ఘటాన్ ), కాటన్ సీడ్‌ రేటు భారీగా పెరుగడంతోనే మార్కెట్లో పత్తి ధరలు పెరుగుతున్నాయని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రైతుల నుంచి చేజారిన తరువాత..
నిర్మల్‌ జిల్లా మార్కెట్లో పత్తి కొనుగోలు అధికారికంగా గతేడాది నవంబర్‌ 1వ తేదీన ప్రారంభమైనప్పటికీ అనధికారికంగా అక్టోబర్‌ నెలలో మధ్య నుంచే కొనుగోలు ప్రారంభమయ్యాయి. పత్తికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర క్వింటాలుకు రూ.4,160 కాగా, భైంసా మార్కెట్లో ప్రారంభ ధర క్వింటాలుకు రూ.4,725 ఇచ్చారు. ఖరీఫ్‌ కొనుగోలు ప్రారంభమైనప్పటీ నుంచి ధర పడిపోవడం మాటేమో కానీ పైపెచ్చు ధర పెరుగుతూనే వచ్చింది. ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ కనీస మద్దతు ధరతోనే కొనుగోలు చేయాల్సి రావడంతో మార్కెట్‌ ధరకు వాణిజ్య కొనుగోలుకు ముందుకు రాలేదు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి మార్కెట్లో ప్రైవేట్‌ వ్యాపారులే పత్తి కొనుగోలు చేస్తున్నారు. ఖరీఫ్‌లో 51 వేల 657 హెక్టార్లలో పత్తి సాగు కాగా 7 లక్షల 74 వేల 855 క్వింటాళ్లు దిగుబడి వస్తుందని అంచనా వేశారు. కాగా, ఇప్పటి వరకు మార్కెట్లో 4 లక్షల 50 వేల క్వింటాల పత్తి అమ్మకాలు జరిగినట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన రైతు చేతి నుంచి అత్యధికంగా పత్తి చేజారిపోయింది. ప్రస్తుత పరిస్థితుల్లో వారం రోజుల నుంచి పత్తి ధర సుమారు రూ.200 పైబడి పెరిగింది. పత్తిని అమ్ముకున్న రైతులకు ఇది నష్టం చేకూరుస్తుండగా, ఇంకా చేతిలో పత్తి ఉన్న రైతు మాత్రం ఇప్పుడే పత్తిని అమ్మేందుకు ముందుకు రావడం లేదు. మరింత ధర పెరుగుతుందని పత్తిని నిల్వ ఉంచుతున్నారు. పెరిగిన ధర మాత్రం వ్యాపారులకు ప్రయోజనం చేకూరుస్తుంది. పత్తిని కొనుగోలు చేసిన తరువాత జిన్నింగ్‌ అండ్‌ ప్రెస్సింగ్‌ చేస్తారు. జిన్నింగ్‌ చేసినప్పుడు పత్తి నుంచి గింజలు వేరై పక్కకు చేరుతాయి. ఆ తరువాత గింజ నుంచి వేరు చేసిన పత్తిని దూది అంటారు. దూదిని ప్రెస్సింగ్‌ చేయ డం ద్వారా బెల్, క్యాండీలుగా(దూది ఘటాన్లు) తయారు చేసి జాతీయం, అంతర్జాతీయంగా ఎగుమతి చేస్తారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఇటు క్యాండీ అటూ పత్తి గింజలు (సీడ్‌) ధరలు అమాంతం పెరగడంతో వ్యాపారులకు రెండు వి«ధాలుగా ప్రయోజనం చేకూరుతుంది.

క్యాండీ : రూ.42 వేలు
దేశీయ మార్కెట్లో ప్రస్తుతం క్యాండీ రేటు రూ.40 వేల నుంచి రూ.42వేలు పలుకుతున్నట్లు మార్కెట్‌ మిర్రర్‌ తెలియజేస్తోంది. పత్తి సీజన్ మొదట్లో రూ.37 వేలు క్యాండీ ధర పలుకగా ఇప్పుడు భారీగా పెరిగింది. అదే సమయంలో పత్తి గింజల ద్వారా 100 కిలోలకు రూ.2,450 నుంచి రూ.2,750 వరకు పలుకుతున్నట్లు తెలుపుతుంది. ఈ నేపథ్యంలో మార్కెట్లో పత్తి ధర ఇంకా పెరిగే అవకాశాలు విశ్లేషకుల ద్వారా తెలుస్తోంది. ఉత్తర భారతదేశంలో పత్తి ధర ప్రస్తుతం రూ.5,200 నుంచి రూ.5,750 పలుకుతుంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో రూ.4,900 నుంచి రూ.5,500 వరకు, కర్ణాటకలో రూ.5,800 వరకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో రూ.5,000 నుంచి రూ.5,900 వరకు పలుకుతున్నట్లు మిర్రర్‌ స్పష్టం చేస్తోంది.

మరిన్ని వార్తలు