పెద్దనోట్ల రద్దుతో ఉపాధికి గండి

20 Dec, 2016 22:35 IST|Sakshi
పెద్దనోట్ల రద్దుతో ఉపాధికి గండి
పొరుగు రాష్ట్రాల్లోనూ పనుల్లేక తగ్గిన వలసలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పెద్దనోట్ల రద్దు ప్రభావం పశ్చిమగోదావరి జిల్లాలో అసంఘటిత రంగంపై తీవ్ర ప్రభావం చూపింది. ముఖ్యంగా హమాలీలు, బిల్డింగ్‌ వర్కర్స్, ఫ్యాక్టరీలో పనిచేసి వారికి పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బిల్డింగ్‌ వర్కర్స్, వడ్రంగి కార్మికులు, ఫ్యాక్టరీల్లో పనులు చేసేవారు, రైస్‌ మిల్లు కార్మికులు, లారీ, ఆటో డ్రైవర్లు సుమారు 5 లక్షల మంది  ఉన్నట్టు అంచనా. వీరిలో జిల్లానుంచి  50 వేల మంది భవన నిర్మాణ కార్మికులు పనుల కోసం బెంగుళూరు, కేరళ, తమిళనాడు వంటి రాష్ట్రాలకు వెళుతుంటారు. నోట్ల రద్దుతో వలసలు పూర్తిగా ఆగిపోయాయి. రబీకి కూడా పూర్తిస్థాయిలో నారుమళ్లు వేయకపోవడంతో వ్యవసాయ కూలీలకు కూడా పని లేకుండా పోయింది. రైతులకు ధాన్యం అమ్మిన సొమ్ములు బ్యాంకులో జమ అయినా తీసుకునే అవకాశం లేకుండా పోయింది. బ్యాంకులు రూ.10 వేలకు మించి నగదు ఇవ్వకపోవడంతో రబీ పెట్టుబడుల కోసం ఇబ్బందులు పడుతున్నారు. చెరువుల్లో నీరు ఉండటంతో ఉపాధి హామీ పనులు ఇంకా అనుకున్న స్థాయిలో ప్రారంభం కాలేదు. అక్కడక్కడా పనులు చేస్తున్నా వేతనాలను కూలీల బ్యాంక్‌ అకౌంట్లలో జమ చేస్తున్నారు. ఆ సొమ్ము తీసుకోవడానికి వెళితే బ్యాంకుల్లో చిల్లర లేదని వెనక్కి పంపుతున్నారని కూలీలు వాపోతున్నారు. 
 
 
కుక్కునూరులో పనులు లేక తెలంగాణ రాష్ట్రం పాల్వంచకు తాపీ పనుల నిమిత్తం వెళ్లాను అక్కడ రోజూ ఏదో ఒక మేస్త్రీ దగ్గర అడ్డాలో పనికి కుదిరేవాడిని. నోట్ల రద్దు తరువాత వారం రోజులు పనులు దొరికాయి. ఎప్పుడైతే బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వడం బంద్‌ అయిందో అప్పటినుంచి పనులు తగ్గిపోయాయి. నన్ను ఎవరూ పనిలోకి తీసుకోకపోవడంతో తిరిగి మా ఊరు వచ్చేశాను. ఇక్కడ ఏదైనా పని ఉంటే వెళుతున్నాను. లేదంటే ఇంటి వద్దనే ఉంటున్నాను.
 ఎండీ వలీపాషా, భవన నిర్మాణ కూలీ, కుక్కునూరు
 
 
>
మరిన్ని వార్తలు