పార్ట్ టైమ్ జాబ్ మోసాలు.. 100 వెబ్‌సైట్లపై కేంద్రం నిషేధం

6 Dec, 2023 12:03 IST|Sakshi

ఢిల్లీ: దేశవ్యాప్తంగా 100 వెబ్‌సైట్లపై కేంద్రం కొరడా ఝళిపించింది. అక్రమాలకు పాల్పడుతున్న వెబ్‌సైట్లపై కేంద్ర హోం శాఖ నిషేధం విధించింది. సర్వీస్ పేరుతో వెబ్‌సైట్లు అక్రమాలకు పాల్పడుతున్నాయని పేర్కొంది. ఆర్ధిక నేరాలకు పాల్పడుతున్న వెబ్‌సైట్లను కేంద్ర హోం శాఖ గుర్తించింది. 

ఈ వెబ్‌సైట్లు మోసపూరిత పెట్టుబడి పథకాలు, పార్ట్ టైమ్ జాబ్ మోసాలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్.. 100 వెబ్‌సైట్‌లను బ్లాక్ చేయాలని సిఫార్సు చేసింది. దీంతో ఆర్ధిక నేరాలకు పాల్పడిన ఈ వెబ్‌సైట్లపై కేంద్రం చర్యలు తీసుకుంది.

విదేశీ వ్యక్తులచే నిర్వహించబడుతున్న ఈ ప్లాట్‌ఫాంలు తమ కార్యకలాపాలను నిర్వహించడానికి డిజిటల్ ప్రకటనలు, చాట్ మెసెంజర్‌లు, అద్దె ఖాతాలను ఉపయోగించాయి. కార్డ్ నెట్‌వర్క్‌లు, క్రిప్టోకరెన్సీలు, అంతర్జాతీయ ఫిన్‌టెక్ కంపెనీల వంటి వివిధ మార్గాల ద్వారా ఈ ఆర్థిక నేరాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేశం నుండి తరలిస్తున్నారని కనుగొన్నారు. నవంబర్ 5న 22 చట్టవిరుద్ధమైన బెట్టింగ్ యాప్‌లు, వెబ్‌సైట్‌లపై నిషేధం విధించిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: దేశంలో నిలిచిన ఐఫోన్ల తయారీ.. కారణం చెప్పిన ఫాక్స్‌కాన్‌

>
మరిన్ని వార్తలు