నోట్ల మార్పిడి ముఠా పట్టివేత

21 Nov, 2016 01:23 IST|Sakshi
నోట్ల మార్పిడి ముఠా పట్టివేత

ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కొనసాగుతున్న విచారణ

గోదావరిఖని : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పాతనోట్లు ఇచ్చి కొత్త నోట్ల మార్పిడి వ్యవహారం బట్టబయలైంది. దందాను సాగిస్తున్న ఓ ముగ్గురిని ఆదివారం రాత్రి గోదావరిఖని స్వతంత్ర చౌక్ ప్రాంతంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోదావరిఖని కళ్యాణ్‌నగర్‌కు చెందిన అబ్దుల్ హక్ స్వంతంత్ర చౌక్‌లో బంగారు నగలు తయారు చేసే దుకాణం నిర్వహిస్తున్నాడు. ఎల్‌బీనగర్‌కు చెందిన తంగళ్లపల్లి సురేశ్ బంగారం దుకాణాలలో వర్కర్‌గా పని చేస్తున్నాడు. వీరితోపాటు మరో వ్యక్తి రద్దు చేసిన నోట్లను తీసుకుంటూ 30 శాతం కమీషన్‌పై కొత్త రూ.2 వేల నోట్లను ఇవ్వడానికి సిద్ధమయ్యారు.

ఈ సమాచారంతో డీసీపీ ఆదేశం మేరకు కమాన్‌పూర్ ఎస్‌ఐ మధుసూదన్‌రావు రంగంలోకి దిగి నోట్లు మార్పిడి చేస్తున్న ముఠా వద్దకు చేరుకుని ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. పాత లక్ష రూపాయలు, కొత్తవి రూ.70 వేలు స్వాధీనం చేస్తున్నారు. గోదావరిఖని వన్‌టౌన్ ఐ ఎ.వెంకటేశ్వర్, సిబ్బంది వెళ్లి వారిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఈ ముఠాలో ఇంకెవరైనా ఉన్నారా ? అనే కోణంలో పోలీసులు మరింత లోతుగా విచారణ చేస్తున్నారు. అరుుతే రద్దు చేసిన నోట్లకు కొత్త రూ.2 వేల నోట్లకు బదులుగా నకిలీ నోట్లను అంటకట్టేందుకు కూడా ఓ ముఠా ప్రయత్నిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు పోలీసులు వారి గురించి కూడా ఆరా తీస్తున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు