దారికాసి దోచేశారు

29 Mar, 2017 00:30 IST|Sakshi
దారికాసి దోచేశారు
నిడదవోలు : పక్కా ప్రణాళికతో రెక్కీ నిర్వహించి ఓ వ్యక్తిపై దాడి చేసి దోపిడీ చేసిన కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సెల్‌ఫోన్‌ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు. నిడదవోలు సీఐ కార్యాలయంలో మంగళవారం సీఐ ఎం.బాలకృష్ణ విలేకరులకు వివరాలు వెల్లడించారు. నిడదవోలు మండలం సింగవరం గ్రామానికి చెందిన చెరకు రామకృష్ణ దేవరపల్లి సబ్‌ పోస్ట్‌మాస్టర్‌గా పనిచేస్తున్నారు. రోజూ నిడదవోలు నుంచి మోటార్‌సైకిల్‌పై చాగల్లు, పల్లంట్ల మీదుగా దేవరపల్లి వెళుతుంటారు. రామకృష్ణ సింగవరంలో ఇల్లు నిర్మించుకుంటుండగా బంధువులు ఇచ్చిన రూ.1.80 లక్షలు తీసుకుని ఈనెల 2న దేవరపల్లి పోస్టాఫీసు నుంచి బయలుదేరారు. ఈ నేపథ్యంలో దోపిడీ ముఠాలోని ఐదుగురు సభ్యులు అంతకుముందు రెండు రోజులుగా రెక్కీ నిర్వహించారు. రామకృష్ణ కదలికలను గమనిస్తూ దోపిడీకి పథకం రచిం చారు. రామకృష్ణ పోస్టాఫీస్‌ వద్ద బయలుదేరుతుండగా ఇద్దరు సభ్యులు అక్కడే ఉండగా మరో ముగ్గురు చాగల్లు మండలం కలవలపల్లి, చిక్కాలపాలెం గ్రామాల మధ్యలో మామిడి తోటల వద్ద మాటు వేశారు. రాత్రి 7.30 గంటలకు రామకృష్ణ నగదు బ్యాగుతో మామిడి తోటలు సమీపంలోకి వచ్చేసరికి ఐదుగురు ముఠా సభ్యులు ఒక్కసారిగా దాడి చేశారు. ముఠాలోని కడలి హరీష్‌ అనే యువకుడు తన గ్లామర్‌ బైక్‌ను అడ్డుగా పెట్టి రామకృష్ణపై పిడిగుద్దులతో దాడి చేశాడు. మిగిలిన వారు కూడా రామకృష్ణను గాయపర్చి రూ.1.80 లక్షల నగదు ఉన్న బ్యాగ్,  సెల్‌ఫోన్, కొన్ని డాక్యుమెంట్లను దోచుకుపోయారు. కొద్దిసేపటికి అటుగా వెళుతున్న ప్రయాణికులు రామకృష్ణ బంధువులకు సమాచారం అందించారు. ఈ మేరకు చాగల్లు పోలీసులు కేసు నమోదు చేశారు. దోపిడీ చేసిన ముఠా తూర్పుగోదావరి జిల్లా దిండి గ్రామంలో నగదును పంచుకున్నారు. పోలీసుల దర్యాప్తులో భాగంగా రామకృష్ణ సెల్‌ఫోన్‌లోని సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిందితులను పట్టుకున్నారు. చాగల్లు మండలం దారవరం వద్ద మోటార్‌సైకిళ్లు తనిఖీలు చేస్తుండగా నిందితులు తూర్పుగోదావరి జిల్లా రాజోలు మండలం శివకోడు గ్రామానికి చెందిన కడలి హరీష్, గుర్రం కృష్ణను అరెస్టు చేశామని సీఐ పేర్కొన్నారు. వీరిద్దరి నుంచి రూ.29,500, రెండు సెల్‌ఫోన్లు, మోటార్‌ సైకిల్‌ స్వాధీనం చేసుకున్నామని, మిగిలిన ముగ్గురి కోసం గాలిస్తున్నట్టు చెప్పారు. కేసును ఛేదించడంలో కృషిచేసిన పట్టణ ఎస్సై డి.భగవాన్‌ప్రసాద్, చాగల్లు ఏఎస్సై ధనరాజ్, హెచ్‌సీ షరీఫ్, కానిస్టేబుల్స్‌ అనిల్, బాలరాజు, నాగేశ్వరరావు, నారాయణ, నాయుడును అభినందించారు.  
 

 

మరిన్ని వార్తలు