అమ్మానాన్నా.. నేనూ వస్తున్నా...

22 Jun, 2016 02:26 IST|Sakshi
అమ్మానాన్నా.. నేనూ వస్తున్నా...

గుండెలు పిండే విషాదం
* నాలుగురోజుల కిందటరోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రుల దుర్మరణం
* దిగులుతో కుమార్తె ఆత్మహత్య
* అనాథలైన ఇద్దరు తమ్ముళ్లు

నవ మాసాలు మోసారు.. కంటికి రెప్పలా కాపాడారు.. ఓ ఇంటిదాన్ని చేశారు.. జీవితాంతం తోడూనీడగా ఉంటాడనుకున్న వాడు తాళిని ఎగతాళి చేసి వదిలేస్తే.. మీరే అండయ్యారు. మీరే సర్వస్వమయ్యారు.. ఊపిరయ్యారు.. కనిపెంచిన మీరే కనిపించే దేవతలయ్యారు. నాకు బాగో లేదంటే చూపిద్దామని ఆస్పత్రికి పిల్చుకెళ్తూ రోడ్డు ప్రమాదంలో వెళ్లిపోయారు. మమ్మల్ని అనాథలను చేసి విగతజీవులుగా మారిపోయారు. మీరు లేని ఈ లోకంలో ఉండలేక.. నేనూ మీ చెంతకే వస్తున్నానమ్మా.  

యాడికి మండలం పచ్చారుమేకలపల్లికి చెందిన ఈశ్వరమ్మ, ఓబులేసు దంపతుల కుమార్తె గాయత్రి(20) సోమవారం రాత్రి ఆత్మహత్యాయత్నం చేయగా, ఆస్పత్రిలో కోలుకోలేక మంగళవారం మృత్యుఒడికి చేరింది. నాలుగు రోజుల కిందట ఆమె తల్లిదండ్రులు ఇదే మండలం వేములపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. అమ్మానాన్న లేరన్న దిగులు ఓ వైపు, మరోవైపు అనారోగ్యం, ఇంకోవైపు ఇద్దరు తమ్ముళ్లను ఎలా పెంచాలోనన్న భయం.. ఆమెను ఆత్మహత్యకు కారణమయ్యాయి.
 
భర్త నిరాదరణకు గురై...:
వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం సోమలూరుకు చెందిన వ్యక్తితో ఏడాది కిందట గాయత్రి వివాహమైంది. మనస్పర్ధల కారణంగా పెళ్లైన నెలకే ఆమె పుట్టింటికి చేరింది. అప్పటి నుంచి ఆమె పుట్టింట్లోనే ఉంటోంది. ఆమెకు అమ్మానాన్నతో పాటు ఇద్దరు తమ్ముళ్లు చక్కగా చూసుకునేవారు.
 
మాయదారి కామెర్లు సోకి..: ఇటీవలే గాయత్రికి పచ్చకామెర్లు సోకాయి. ఆమెకు చికిత్స చేయిద్దామని ఈశ్వరమ్మ, ఓబులేసు ఓ బైక్‌లో, గాయత్రి, మరో బంధువు మరో బైక్‌లో తాడిపత్రి ఆస్పత్రికి నాలుగు రోజుల కిందట బయలుదేరారు. మార్గమధ్యంలో ఆయిల్ ట్యాంకర్ విపరీతమైన వేగంతో వచ్చి ఢీకొనడంతో ఈశ్వరమ్మ, ఓబులేసు అక్కడికక్కడే మరణించిన సంగతి తెలిసిందే. దీంతో వారి పిల్లలు గాయత్రి సహా కుమారులు శివకుమార్, జగదీశ్ తల్లిదండ్రుల వద్ద విలపించిన తీరు అందరినీ కలచివేసింది. మేం ఎవరి కోసం బతకాలంటూ? గాయత్రి తమ తల్లి చెంపలను నిమురుతూ విలపించడాన్ని ‘సాక్షి’ ప్రచురించింది.
 
జీవితంపై దిగులుతో...: భర్త వదిలేశాడన్న ఆవేదనలో ఉన్న గాయత్రికి కొండంత అండగా ఉంటారనుకున్న అమ్మానాన్న అంతలోనే రోడ్డు ప్రమాదంలో మరణించడం ఆమెను కుంగదీసింది. ఇద్దరు తమ్ముళ్ల బాధ్యత గుర్తుకు రావడంతో తట్టుకోలేకపోయింది. భవిష్యత్తు భయంకరంగా భావించిన ఆమె చివరకు సోమవారం రాత్రి విషద్రావకం తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే బంధువులు ఆమెను తాడిపత్రికి అక్కడి నుంచి అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అయినా కోలుకోలేక మంగళవారం తనువు చాలించింది. అటు అమ్మానాన్న, ఇటు అక్కను పోగొట్టుకున్న శివకుమార్(ఇంటర్‌తో చదువు ఆపేశాడు), జగదీశ్(ప్రస్తుతం తొమ్మిదో తరగతి) ఇప్పుడు తమకు దిక్కెవరంటూ కన్నీరుమున్నీరుగా విలపించడం ప్రతి ఒక్కరి గుండెలను పిండేసింది.

మరిన్ని వార్తలు