బీబీనగర్‌లో డ్రైపోర్టు

15 Feb, 2016 02:34 IST|Sakshi

- ప్రతిపాదనను పరిశీలిస్తున్న రైల్వే శాఖ
సాక్షి, హైదరాబాద్: సముద్ర తీరప్రాంతం లేని రాష్ట్రాల్లో డ్రైపోర్టులను నిర్మించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నేపథ్యంలో తెలంగాణలో తొలి డ్రైపోర్టు నిర్మాణానికి రంగం సిద్ధమవుతోంది. నల్లగొండ జిల్లా పరిధిలో ఉన్న బీబీనగర్‌లో దీనిని ఏర్పాటు చేసే దిశగా కసరత్తు సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో కేంద్రం కూడా దీనికి పచ్చజెండా ఊపే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 25న ప్రవేశపెట్టే రైల్వే బడ్జెట్‌లో సూత్రప్రాయంగానైనా దీని ప్రస్తావన ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.
 
 ప్రయోజనాలు ఏమిటి..?
 విదేశాలకు సరుకు ఎగుమతుల్లో నౌకాశ్రయాల పాత్ర కీలకం. తీరప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందేందుకు ఇవి దోహదం చేస్తాయి. కానీ తీరప్రాంతాలు లేని చోట్ల ఆ వెలితి కనిపిస్తోంది. ఇది పెట్టుబడులపైనా ప్రభావం చూపుతోంది. తీరప్రాంతం లేని చోట్ల ఉత్పత్తులను రోడ్డు మార్గం ద్వారానే తరలించాలి. ఆ ఉత్పత్తులు నౌకాశ్రయాలకు వెళ్లిన తర్వాత కస్టమ్ సంబంధిత తంతు ఇతర పనులు పూర్తి కావటానికి సమయం పడుతోంది. అప్పటి వరకు ఉత్పత్తులు అక్కడే ఉండిపోతున్నాయి. దీంతో కంపెనీలపై ఆర్థిక భారం పడుతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతాలు లేని చోట్ల డ్రైపోర్టులు నిర్మించి అన్నిరకాల ఎగుమతి తంతులను అక్కడే పూర్తి చేసి రైలు మార్గం ద్వారా నౌకాశ్రయాలకు ఉత్పత్తులు తరలించాలని కేంద్రం భావిస్తోంది.
 
మరోవైపు కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రం కావటంతో పెట్టుబడులను ఆకట్టుకునే క్రమంలో డ్రైపోర్టులు ఏర్పాటు చేసుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల కేంద్రంతో చర్చలు జరిపి కనీసం నాలుగైదు చోట్ల డ్రైపోర్టుల ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరింది. ఈ క్రమంలో బీబీనగర్ రైల్వే స్టేషన్‌ను అనుసంధానిస్తూ డ్రైపోర్టు నిర్మించాలని స్థానిక ఎంపీ బూర నర్సయ్యగౌడ్ ఇటీవల రైల్వే శాఖకు ప్రతిపాదించారు. వచ్చే రైల్వే బడ్జెట్‌లో దీనికి స్థానం కల్పించాలని ఆయన రైల్వే మంత్రి సురేశ్‌ప్రభును కోరారు. డ్రైపోర్టు ఏర్పాటైతే హైదరాబాద్ చుట్టుపక్కల భారీగా పెట్టుబడులు పెట్టేందుకు బడా సంస్థలు ముందుకు వస్తాయని, ఇది హైదరాబాద్‌తోపాటు సమీప ప్రాంతాల అభివృద్ధికి దోహదం చేస్తుంది.

>
మరిన్ని వార్తలు