దక్షిణ మధ్య రైల్వేకు రికార్డు స్థాయి ఆదాయం 

3 Dec, 2023 05:15 IST|Sakshi

నవంబర్‌లో రూ.1,600 కోట్ల ఆర్జన 

సాక్షి, హైదరాబాద్‌: గత కొన్నేళ్లుగా గరిష్ట స్థాయి ఆదాయాన్ని ఆర్జిస్తూ తన పాత రికార్డులు అధిగమిస్తున్న దక్షిణ మధ్య రైల్వే ఇప్పుడు మరో ఘనతను సాధించింది. నవంబర్‌ నెలకు సంబంధించి రైల్వే శాఖ ఆల్‌టైమ్‌ రికార్డు సృష్టించింది. ఇటు ప్రయాణికుల రైళ్ల ద్వారా, అటు సరుకు రవాణా రైళ్ల ద్వారా నవంబర్‌లో రూ.1,600.53 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.

గత ఏడాది నవంబర్‌లో గరిష్ట ఆదాయం రూ.1,454 కోట్లు మాత్రమే కాగా, ప్రయాణికుల రైళ్ల ద్వారా రైల్వే ఈ సంవత్సరం నవంబర్‌లో 469.40 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ప్రయాణికుల అవసరాల మేరకు 342 అదనపు ట్రిప్పులను నడిపింది.ఇది 64 రైళ్లకు సమానం. వీటిల్లో 3.39 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. అలాగే రైల్వే శాఖ ఈ నవంబర్‌లో 11.57 మెట్రిక్‌ టన్నుల స­రు­కును రవాణా చేసింది. దీని ద్వారా రూ.­1,131.13 కోట్ల ఆదాయాన్ని సంపాదించింది. ఇది గతేడాది నవంబర్‌ ఆదాయం కంటే పది శాతం ఎక్కువ.

కొత్త క్‌లైంట్‌లతో ఒప్పందాలు చేసుకోవటం, సరుకు రవాణా చేసే కొత్త గమ్యస్థానాలను జోడించటం, కొత్త ట్రాక్‌ను అందుబాటులోకి తేవటం వంటి చర్యల ద్వారా ఇది సాధ్యమైందని రైల్వే శాఖ వర్గాలు వెల్లడించాయి. ఆదాయాన్ని భారీగా పెంచడానికి కృషి చేసిన ఉద్యో­గులు, ఇతర సిబ్బందిని జోన్‌ జీఎం అరుణ్‌కు­మార్‌ జైన్‌ అభినందించారు. ఈ ఆర్థిక సంవత్స­రం మొత్తానికి సంబంధించి కూడా ఇదే తరహా రికార్డును సాధించాలని ఆయన సూచించారు.

మరిన్ని వార్తలు