డాక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే

13 Jul, 2017 11:26 IST|Sakshi
డాక్టర్‌ వర్సెస్‌ ఎమ్మెల్యే

‘రాష్ట్ర సదస్సు ఖర్చు’ విషయంలో రాజుకున్న వివాదం
– డాక్టర్లందరి ముందు యెండ్లూరి, చౌదరి వాగ్వాదం
– తానేం చందాలేసుకుని కాన్ఫరెన్స్‌ పెట్టలేదన్న డాక్టర్‌
– లేనిపోని ఆరోపణలు చేయొద్దని హితవు
– చివరకు వెనక్కు తగ్గిన ప్రజాప్రతినిధి
– ఎమ్మెల్యే వైఖరిపై వైద్య వర్గాల విస్మయం


అనంతపురం మెడికల్‌ : అనంతపురం అర్బన్‌ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి తీరు వివాదాస్పదమైంది. వైద్య వర్గాల్లో ఆయన వ్యవహార శైలి చర్చనీయాంశంగా  మారింది. వివరాల్లోకి వెళితే.. బుధవారం సర్వజనాస్పత్రిలో అన్ని విభాగాల హెచ్‌ఓడీలతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలో బెడ్లు లేక గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారని, కొత్తగా నిర్మించిన భవనంలో వారికి సదుపాయం కల్పిస్తే ఎలాగుంటుందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ జగన్నాథ్‌ను కోరారు. దీంతో గర్భిణిలు పై అంతస్తుకు ఎక్కలేరని ఆయన సమాధానమిచ్చారు. చివరకు పీడియాట్రిక్‌ వార్డును అక్కడికి మార్చే విషయమై చర్చ చేపట్టగా సిబ్బంది కొరత ఉందని జగన్నాథ్‌ చెప్పారు. శానిటేషన్, సెక్యూరిటీ సమస్యలు ఉన్నాయన్నారు. దీంతో డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(డీఎంఈ) సుబ్బారావుతో ఫోన్‌లో ఎమ్మెల్యే మాట్లాడారు. ‘నైట్‌ రౌండ్స్‌కి వచ్చాను.. గర్భిణిలు బయట ఉన్నామని బాధపడ్డారు. బిల్డింగ్‌ రెడీ అయ్యింది. ఏదో ఒకటి చేయండి. అవసరమైతే తాత్కాలికంగా మేం మెయింటేన్‌ చేస్తాం’ అన్నారు. అయితే తాను కౌన్సెలింగ్‌లో ఉన్నానని, తర్వాత మాట్లాడుతానని డీఎంఈ సమాధానం ఇచ్చారు.

వివాదం రాజుకుందిక్కడే...!
కొత్త భవనంలో మూడు షిఫ్టులకు 40 మంది అవసరమవుతారని, వీరి జీతాలకు నెలకు రూ.2.08 లక్షలు అవసరమని తేల్చారు. ఆ వెంటనే ఎదురుగా ఉన్న మానసిక వైద్యుడు యెండ్లూరి ప్రభాకర్‌ను పిలుస్తూ ‘ప్రభాకర్‌ నువ్వు పెట్టొచ్చు కదా.. మీ అసోసియేషన్‌ నుంచి మూడు నెలల జీతాలివ్వండి.. మొన్న కాన్ఫరెన్స్‌కు రూ.50 లక్షలు ఖర్చు పెట్టారు. 400 పట్టుచీరలు పంచారు.. బ్రహ్మాండంగా ఖర్చు పెట్టారట. ఇదీ ఓ సమస్యనా’ అని అనడంతో వివాదం రాజుకుంది. ‘మీరలా అనడం మంచిది కాదు. వీళ్లంతా (సమావేశంలో ఉన్న డాక్టర్లను చూపిస్తూ) డెలిగేట్స్‌గా వచ్చారు. ఒక్కో డెలిగేట్‌ రూ.2 వేలు కడతారు. ఎవరికి శారీస్‌ ఇచ్చానో చెప్పమనండి. స్టేట్‌ కాన్ఫరెన్స్‌ను జిల్లాకు తీసుకొస్తే బ్లేం చేయడం ఏంటి? నేనేం చందాలు వేసుకుని కాన్ఫరెన్స్‌ చేయలేదు.. ప్రభుత్వం నుంచి నిధులేమీ రాలేదు. కాలేజ్‌ ప్రిన్సిపాల్‌ కనీసం పెయింటింగ్‌ కూడా చేయించలేదు.

అయినా జాతీయ స్థాయిలో పేరున్న డాక్టర్లను పిలిపించి మానసిక వైద్యంపై చర్చించాం.. ఎట్లవుతుంది రూ.50 లక్షలు’ అని ప్రశ్నించారు. దీంతో ఎమ్మెల్యే ‘బయట టాక్‌ ఉంది. కొందరు చెప్పారు’ అంటూ ఓ వ్యక్తికి అక్కడి నుంచే ఫోన్‌ చేసి స్పీకర్‌ ఆన్‌ చేశారు. అవతలి వ్యక్తి రూ.30 లక్షల వరకు ఖర్చు చేసుంటారు! అని చెప్పాక కట్‌ చేశారు. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. ‘ఎవరో చెబితే ఓ రాజకీయ నాయకుడిగా మీరు చెప్పడమేంటి? మీరు కూడా కాన్ఫరెన్స్‌కు వచ్చారు కదా? నేనేం చేశానో అందరినీ అడగండి. బెస్ట్‌ డాక్టర్‌గా నాకు ఏడు అవార్డులు వచ్చాయి. ఇంత పెద్ద ప్రోగ్రాం చేశాక అప్రిసియేషన్‌ కావాలనుకుంటా? ఇలా మాట్లాడతారేంటి’ అని యెండ్లూరి ప్రశ్నించారు. దీంతో ‘సర్వీస్‌ కింద ఖర్చు పెడతారేమోనని అడిగానంతే’ అంటూ ఎమ్మెల్యే వెనక్కు తగ్గారు.  

ఎమ్మెల్యే తీరు విస్మయం
ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి తీరుపై వైద్యులు విస్మయం వ్యక్తం చేశారు. ‘వంద బెడ్లతో వార్డును ప్రారంభించాలంటే సెక్యూరిటీ, పారిశుద్ధ్య కార్మికులుంటే సరిపోతుందా? వైద్యులు, పారామెడికల్‌ సిబ్బంది.. ఇలా అనేక సమస్యలుంటాయి. అవన్నీ పట్టించుకోకుండా ఏదో హడావుడి చేయడమేంటి? ఎమ్మెల్యేగా ఎన్నికయినప్పటి నుంచి ఆస్పత్రికి ఆయనేం చేశారో చెప్పమనండి. ఓ వాటర్‌ఫిల్టర్‌ తెచ్చి పెట్టారు. నిజంగా అంత ప్రేముంటే 510 పోస్టులు భర్తీ చేసేందుకు విడుదల చేసిన జీఓ 124ను అమలు చేసి సిబ్బంది కొరత తీర్చమనండి’ అనే చర్చ జరిగింది.

మరిన్ని వార్తలు