ఆ పాలు.. లీటరు రూ. 6 వేలు

15 Oct, 2015 08:56 IST|Sakshi
ఆ పాలు.. లీటరు రూ. 6 వేలు

అనపర్తి: కాలం మారింది. గాడిదను ఓ అల్పజీవిగా, ఓ తిట్టుపదంగా మాత్రమే పరిగణించే రోజులకు కాలం చెల్లింది. ‘కడివెడైననేమి ఖరము పాలు’ అన్న మాటనూ మార్చుకోవలసి వస్తోంది. మరి.. గాడిద పాలకు పెరిగిన గిరాకీ అలా ఉంది. ఆ గిరాకీ ఎంత అంటే లీటరు రూ.6 వేల వరకు రేటు పలికేటంత. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలకు చెందిన కొందరు అనపర్తికి బుధవారం సుమారు 80 ఆడ గాడిదలను తోలుకు వచ్చారు. వాటిని సంపన్నుల వాకిళ్ల ముందుకు తీసుకు వెళ్లారు.
 
ఇంతకీ విషయమేమిటంటే.. గాడిద పాలు తాగితే ఉబ్బసం, అజీర్తి, కీళ్ల నొప్పులు వంటి పలు రోగాలు మటుమాయమవుతాయన్న నమ్మకంతో పలువురు ఆ పాల కోసం ఎగబడ్డారు. దీంతో గిరాకీ పెరిగి లీటరు రూ.6 వేలకు అమ్మారు. ఒక్కో గాడిద రోజుకోసారి 200 నుంచి 250 మిల్లీ లీటర్లు మాత్రమే పాలు ఇవ్వడంతో బుధవారం పాలు దొరకని వారు మర్నాడు పాలు తమకే ఇచ్చేలా అడ్వాన్సు కూడా చెల్లించారు. అజీర్తి, ఉబ్బసంతో బాధపడేవారికి గాడిద పాలు మంచి ఔషధమని గాడిదల పెంపకందారుడు మాచర్ల కాలయ్య చెప్పారు. అనేక చోట్ల లీటర్లు రూ.2 వేల వరకూ పలుకుతుండగా అనపర్తిలో ఏకంగా రూ.6 వేల వరకూ పెరగడం విశేషం.

మరిన్ని వార్తలు