మంచి సినిమాలకు థియేటర్ల కొరత లేదు

15 Oct, 2015 07:56 IST|Sakshi
మంచి సినిమాలకు థియేటర్ల కొరత లేదు

రామచంద్రపురం : మంచి సినిమాలకు థియేటర్ల కొరత ఎప్పుడూ ఉండదని ప్రముఖ నిర్మాత, సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్ బాబు అన్నారు. ఇటీవల రిలీజై విజయవంతమైన ‘భలే భలే మగాడివోయ్’, ‘సినిమా చూపిస్త మావ’, ‘ఉయ్యాల జంపాల’ చిత్రాలే ఇందుకు ఉదాహరణలన్నారు. రామచంద్రపురంలో ఎమ్మెల్యే తోట త్రిమూర్తులుకు చెందిన సూర్య సినిమాక్స్ ట్విన్ థియేటర్స్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సురేష్‌బాబుతో ఇంటర్వ్యూ...
 
ప్ర: పెద్ద సినిమాల రిలీజ్‌కు మధ్య వారం రోజుల గ్యాప్ ఉండాలని ఇటీవల ద ర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. దీనిపై మీ అభిప్రాయం?
సురేష్‌బాబు: పెద్ద సినిమాల రిలీజ్‌కు మధ్య గ్యాప్ ఉండాలనేది మంచిదే. కానీ దీనికి పరిష్కారం దొరకడంలేదు. అయితే తెలుగు సినిమాలకు సంబంధించి ఇటీవల బాహుబలి, రుద్రమదేవి మధ్య, బ్రూస్‌లీ, అఖిల్‌కు మధ్య గ్యాప్ తీసుకున్నారు. ఇందుకోసం థియేటర్ల కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నం చేస్తున్నాము.
 
ప్ర: చిన్న చిత్రాలకు థియేటర్ల కొరత ఉందని అంటున్నారు.. దీనికి మీరేం చెబుతారు?
సురేష్‌బాబు: ప్రేక్షకులు చూసి ఆదరించే విధంగా సినిమాలు తీస్తే థియేటర్లకు కొరత ఉండదు.చిన్న చిత్రాలైనా, పెద్దచిత్రాలైనా ప్రేక్షకాదరణ పొందేలా ఉండడమే ప్రధానం.
 
ప్రశ్న: గ్రామీణ ప్రాంతాలలో సైతం మల్టీప్లెక్స్ థియేటర్లు రావడంపై మీ కామెంట్?
సురేష్‌బాబు: థియేటర్లు ఆధునిక హంగులతో ఉంటేనే ప్రేక్షకులు వస్తారు. కిలోమీటర్ల దూరం వెళ్లాల్సిన అవసరం లేకుండా దగ్గరల్లోనే అన్ని హంగులతో థియేటర్లు ఉండడం మంచిదే. సాంకేతిక విజ్ఞానాన్ని ప్రేక్షకులు ముంగిటికి తీసుకురావడం మంచి పరిణామం.
 
ప్ర: మీ కొత్త సినిమాల గురించి చెప్పండి?
సురేష్‌బాబు: త్వరలో రాణాతో, ఆ పైన వెంకటేష్‌తో భారీ చిత్రాలకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఒక చిన్న చిత్రం కూడా ప్లాన్ చేస్తున్నాము.

మరిన్ని వార్తలు