న్యాయ వ్యవస్థను గుడిసెలు, అద్దెభవనాల్లోకి తరలించలేం

29 Jun, 2016 21:07 IST|Sakshi
- ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 
నెల్లూరు సిటీ: ఉన్నపాటుగా మిగిలిన శాఖలతో పాటు న్యాయవ్యవస్థను గుడిసెలు, అద్దె భవనాల్లోకి తరలించలేమని టీడీపీ నేత, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి అన్నారు. ఈ విషయం తెలంగాణ ప్రభుత్వానికి, న్యాయాధికారులకు తెలుసన్నారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవన్‌లో బుధవారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ..ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో ఏపీకి 10 సంవత్సరాల పాటు పాలించే హక్కుందన్నారు. కేసీఆర్ తెలంగాణ సెంటిమెంట్‌ను అడ్డు పెట్టుకుని రాజకీయ పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చే తీర్పులో ముఖ్యమైనవి ఉంటాయని, వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ఉందన్నారు. వారికి సరైన సౌకర్యాలు కల్పించాకే నూతన రాజధానికి మారుస్తామని చెప్పారు.

న్యాయవాదులను 60:40 నిష్పత్తిలో విభజిస్తామంటే అడ్డుపడుతున్నారని, రాష్ట్రం విడిపోయిన తరువాత బార్ కౌన్సిల్ విడిపోవాల్సి ఉందని దీన్ని తెలంగాణ ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వం ఆస్తులు, నీటి పంపకాల విషయంలో కూర్చునేందుకు సమయం కేటాయించదని ఎద్దేవా చేశారు. ఎక్కడ శాంతి భద్రతల విషయంలో కోర్టులు అంతిమతీర్పులు ఇస్తాయో, అక్కడే శాంతికి విఘాతం కలిగే పరిస్థితి చరిత్రలో ఇంతకుముందు జరగలేదన్నారు. ఉమ్మడి రాజధానిలో ఇష్టప్రకారం వ్యవహరిస్తే కుదరదని సోమిరెడ్డి అన్నారు.
మరిన్ని వార్తలు