ఇంతకీ ఎవరెస్ట్ ఎక్కారా లేదా?

30 Jun, 2016 08:14 IST|Sakshi
ఇంతకీ ఎవరెస్ట్ ఎక్కారా లేదా?

పర్వతారోహణ అంత సులభం కాదు. అందులోనూ ఎవరెస్ట్ శిఖరం అధిరోహించడం అంటే అతి పెద్ద విజయమే. తాము అలాంటి విజయాన్ని సాధించామంటూ పుణెకు చెందిన ఓ పోలీసు జంట అందరినీ మోసం చేసిందని ఫిర్యాదు వచ్చింది. మే 23వ తేదీన తాము ఎవరెస్ట్ ఎక్కామంటూ మార్ఫింగ్ చేసిన ఫొటోలను ప్రదర్శించారు. దీనిపై విచారించి, వాస్తవాలను బయటపెట్టాలని ఒక నిజనిర్ధారణ కమిటీని నగర పోలీసు కమిషనర్ రశ్మి శుక్లా ఆదేశించారు. దినేష్ రాథోడ్, తారకేశ్వరి అనే ఇద్దరు కానిస్టేబుళ్లు భార్యభర్తలు. వీళ్లు ఎవరెస్ట్ ఎక్కినట్లు ఫొటోలు మార్ఫింగ్ చేసి చూపించారని పుణెకు చెందిన కొంతమంది పర్వతారోహకులు కమిషనర్కు ఫిర్యాదు చేశారు. ఎవరెస్ట్ అధిరోహణకు వెళ్తున్నామంటూ రాథోడ్ దంపతులు ఏప్రిల్లో బయల్దేరారు. జూన్ 5వ తేదీన ఖట్మాండులో ప్రెస్మీట్ పెట్టి, మే 23న తాము ఎవరెస్ట్  ఎక్కామని చెప్పారు.

అయితే, దీనిపై ఫిర్యాదులు రావడంతో నగరానికి చెందిన శరద్ కులకర్ణి, అంజలి కులకర్ణి, ఆనంద్ బాన్సోడ్, శ్రీకాంత్ చవాన్ తదితర పర్వతారోహకుల నుంచి పోలీసులు వివరాలు తీసుకున్నారు. పది రోజుల క్రితం రాథోడ్ దంపతులు పుణెకు తిరిగొచ్చారని, కానీ వాళ్లు ఇంతవరకు తమను కలవలేదని జాయింట్ పోలీసు కమిషనర్ సునీల్ రామానంద్ తెలిపారు. వాళ్లు నిజంగా ఎవరెస్ట్ ఎక్కారా లేదా అనే విషయం తెలుసుకోడానికి నేపాల్ ప్రభుత్వం నుంచి కూడా సాయం తీసుకుంటామన్నారు. దీనిపై విచారణ జరుగుతున్నందున ఇప్పుడు తాము ఏం చెప్పడం బాగోదని, విచారణలోనే అన్ని విషయాలూ వెల్లడిస్తానని తారకేశ్వరి రాథోడ్ అన్నారు.

ఎవరెస్ట్ ఎక్కేటప్పుడు తమ ముందు ఎవరున్నారు, వెనక ఎవరున్నారనే విషయం పర్వతారోహకులందరికీ తెలుస్తుందని, కానీ వీళ్లు మే 23న ఎక్కామని చెబుతూ జూన్ 5వ తేదీ వరకు ఆ విషయం ఎందుకు వెల్లడించలేదని గత 40 ఏళ్లుగా ఇదే రంగంలో ఉన్న ఉమేష్ జిర్పే అనే పర్వతారోహకుడు ప్రశ్నించారు. వాళ్లు మూడు ఫొటోలు చూపిస్తే, మూడింటిలోనూ బూట్లు వేర్వేరుగా ఉన్నాయని.. ఎవరెస్ట్ మీద దుస్తులు గానీ, బూట్లు గానీ మార్చుకోవడం అసాధ్యమని, అలా చేస్తే ఫ్రాస్ట్ బైట్ తప్పదని తెలిపారు.

అయితే.. నేపాల్ ప్రభుత్వం ఎవరెస్ట్ను అధిరోహించినట్లు తమకు ఇచ్చిన సర్టిఫికెట్తో పాటు ఇతర ఆధారాలను విచారణ అధికారులకు ఇచ్చామని కానిస్టేబుల్ దినేష్ రాథోడ్ తెలిపాడు. కొందరు వ్యక్తులు తమ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని.. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని వెల్లడించాడు. విచారణ పూర్తయితే గానీ ఈ జంట ఎవరెస్ట్ ఎక్కిందీ.. లేనిది తేలేలా లేదు.

మరిన్ని వార్తలు