డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు వారంలోగా టెండర్లు

24 Aug, 2016 22:19 IST|Sakshi
డబుల్‌బెడ్‌రూం ఇళ్లకు వారంలోగా టెండర్లు

సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్‌లో కొత్తగా పలు ప్రాంతాల్లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు ఆటంకాలు దాదాపుగా తొలగిపోయాయి. ఈమేరకు వారంలో టెండర్లు పిలిచేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఐడీహెచ్‌కాలనీలోని ‘డబుల్‌’ ఇళ్ల నిర్మాణం తర్వాత దాదాపు ఏడాదికాలంగా ఇంతవరకు ఎక్కడా ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు.  ఆయా బస్తీల్లో ఈ ఇళ్ల నిర్మాణానికి గత జనవరిలోనే మంత్రులు శంకుస్థాపనలు చేసినా...ఎక్కడా పనులు మొదలు కాలేదు. తొలుత తొమ్మిది బస్తీల్లో  రూ. 151 కోట్లతో 2160 ఇళ్ల నిర్మాణాలకు మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు.

ప్రభుత్వం నిర్ణయించిన ఒక్కో ఇంటి ధర రూ. 6.81 లక్షలతో ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని ఎవరూ ముందుకు రాలేదు. మరోవైపు స్థలం అందుబాటులోకి రాలేదు. అంతే కాకుండా  బహుళ అంతస్తుల్లో నిర్మించేవాటికి టౌన్‌ప్లానింగ్‌ విభాగం నుంచి అనుమతులు పొందాలంటే నిబంధనలు పక్కాగా అమలు చేయాలి. ఫైర్‌సర్వీసెస్‌ నుంచి ఎన్‌ఓసీ పొందాలి. ఇతరత్రా  సాంకేతికాంశాల ఇబ్బందుల దృష్ట్యానూ కాంట్రాక్టర్లు  వెనుకడుగు వేశారు. అయితే, డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు సంబంధించి బహుళ అంతస్తుల్లో నిర్మించే వాటికి భవన నిబంధనల్లో మినహాయింపులనిస్తూ మంగళవారం ప్రభుత్వం జీవో జారీచేసింది.

ఇంటి నిర్మాణ ఖర్చును జీ ప్లస్‌ 3 అంతస్తుల్లో నిర్మించేవాటికి రూ.7 లక్షలుగా,  సెల్లార్‌  ప్లస్‌ స్టిల్ట్‌  ప్లస్‌ 9 అంతస్తుల్లో నిర్మించే వాటికి రూ.7.90 లక్షలుగా ఖరారు చేసింది. ఆయా ప్రాంతాల్లో  స్థలం కూడా అందుబాటులో ఉంది. దీంతో తొలుత 18 ప్రాంతాల్లో 5050 ఇళ్లు నిర్మించవచ్చునని అంచనా వేశారు. వీటి నిర్మాణం కోసం టెండర్లు పిలిచే పనుల్లో అధికారులు నిమగ్నమయ్యారు. నగరంలో స్థలాల కొరత తీవ్రంగా ఉన్నందున తొలిదశలో ఆయా బస్తీల్లో ప్రజలుంటున్న ప్రాంతాల్లోనే వారి గుడిసెలు, చిన్న ఇళ్ల స్థానంలో వీటిని నిర్మించనున్నారు.  వీటన్నింటినీ బహుళ అంతస్తుల్లో నిర్మిస్తే ఎక్కువమందికి ప్రయోజనం కలుగుతుందని భావించారు. అయితే పేదలుండే మురికివాడల్లో  ఎక్కువ వెడల్పున్న రోడ్లు లేకపోవడం..

నిబంధనల కనుగుణంగా సెట్‌బ్యాక్‌లు వదిలే అవకాశం లేకపోవడం వల్ల కూడా జాప్యం జరిగింది. తాజాగా నిర్మాణ అనుమతుల్లో పలు మినహాయింపుల నిచ్చారు. ఆయా ప్రాంతాల్లో తమ చిన్న ఇళ్ల స్థానే డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు ప్రజలు సుముఖత వ్యక్తం చేయడంతో ఇక నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు ఉండబోవని అధికారులు భావిస్తున్నారు.

తొలిదశలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించనున్న ప్రాంతాలు, ఇళ్ల సంఖ్య, వ్యయం ఇలా...
.....................................................................................................................
 బస్తీ                                    నియోజకవర్గం        ఎన్ని ఇళ్లు      ఖర్చు (రూ.లక్షల్లో)
......................................................................................................................
1.చిలకలగూడ దోబీఘాట్‌                 సికింద్రాబాద్‌     171        1350.90
2. ఏసీఎస్‌ నగర్‌                                      ’’               90         630.00
3.జీవై రెడ్డి కాంపౌండ్‌                         సనత్‌నగర్‌        224        1769.60
4.కట్టెలమండి                                 గోషామహల్‌        212        1484.00
5.మంగాడి బస్తీ                                 నాంపల్లి           200        1580.00
6.హమాలీ బస్తీ                               సనత్‌నగర్‌         360          2844.00
7.జియాగూడ                                  కార్వాన్‌           1350        10665.00
8.బండమైసమ్మ                             సనత్‌నగర్‌         473          3736.70
9.అంకమ్మ బస్తీ                                   ’’                  90            711.00
10.కట్టమైసమ్మ సిల్వర్‌కాంపౌండ్‌    కంటోన్మెంట్‌         360          2520.00
11. లంబాడి తండ                        ముషీరాబాద్‌        108          853.20
12.పిల్లి గుడిసెలు                          మలక్‌పేట            324           2559.60
13. ఎరుకల నాంచారమ్మబస్తీ         ఎల్‌బీనగర్‌           432           3412.80
14.చిత్తారమ్మ బస్తీ                        కూకట్‌పల్లి            108           853.20
15.జంగమ్మెట్‌                          చాంద్రాయణగుట్ట       216         1706.40
16. సరళాదేవి నగర్‌                   యాకుత్‌పురా         108          853.20
17. సయ్యద్‌సాబ్‌కాబాడా          యాకుత్‌పురా           48            336.00
18.సింగంచెర్వు తండా                  ఉప్పల్‌                 176          1232.00
.......................................................................................................................
– వీటిల్లో ఏసీఎస్‌నగర్, కట్టెలమండి, కట్టమైసమ్మ సిల్వర్‌కాంపౌండ్, సయ్యద్‌సాబ్‌కాబాడా,సింగంచెర్వు తండాల్లో  జీ ప్లస్‌ 3           అంతస్తుల్లో, మిగతావి
సెల్లార్‌  ప్లస్‌ స్టిల్ట్‌  ప్లస్‌ 9 అంతస్తుల్లో నిర్మించనున్నారు.
–ఇంటి నిర్మాణ వ్యయం కాక, మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో ఇంటికి రూ. 75 వేలు  ఖర్చు చేసేందుకు ప్రభుత్వం అనుమతించింది.
 – ఒక్కో ఇంటిని దాదాపు 560 చ.అ.ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు.
– వీటిల్లో లివింగ్‌హాల్, మాస్టర్‌ బెడ్‌రూమ్‌ , బెడ్‌రూమ్‌ , కిచెన్,  రెండు రకాల టాయ్‌లెట్లు, బాత్‌రూమ్‌లు  ఉంటాయి.
.........................................

నిర్మాణ వ్యయంలో ఎవరి వాటా ఎంత.. ?
– ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రప్రభుత్వం గృహనిర్మాణ పథకం ద్వారా రూ. 1.50 లక్షలు అందజేస్తుంది.
– రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ. 5.50 లక్షలు భరిస్తుంది.
– అంటే రూ. 7 లక్షల వ్యయమయ్యే ఇళ్లకు కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల నిధులే సరిపోతాయి.
– రూ. 7.90 లక్షల వ్యయమయ్యే ఇళ్లకు  కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అందజేసే రూ. 7 లక్షలు పోను మిగతా రూ. 90 వేలు జీహెచ్‌ఎంసీ భరిస్తుంది.
– మొత్తం రూ. 5050 ఇళ్ల నిర్మాణానికి రూ. 390.97 కోట్లు ఖర్చు కానుంది.

 

మరిన్ని వార్తలు