ఇదేంటి కేశవా ?

25 Jul, 2017 22:40 IST|Sakshi
ఇదేంటి కేశవా ?

– రూ. 56 కోట్ల తాగునీటి పథకం ప్రారంభానికి రాజకీయ గ్రహణం
– ప్రభుత్వానికి వినిపించని 40 గ్రామాల ప్రజల దాహం కేకలు
– నీరు విడుదల చేయాలని ప్రభుత్వంపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ఒత్తిడి


ఉరవకొండ : ఉరవకొండ నియోజకవర్గంలో టీడీపీ నేతల కుటిల రాజకీయాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ప్రజల దాహర్తి తీర్చడంలో కూడా నీచ రాజకీయాలు చేస్తున్నారు. గత ఏడాదే పూర్తి అయిన రూ. 56 కోట్ల తాగునీటి పథకాన్ని ప్రారంభం కాకుండా అడ్డుపడుతున్నారు. దీంతో 46 గ్రామాల ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు.

టీడీపీ నేతల ఒత్తిడితోనే..
ఉరవకొండ నియోజకవర్గంలోని కూడేరుతో పాటు మరో రెండు మండలాల ప్రజల దాహర్తిని తీర్చేలా రూ.56 కోట్లు వెచ్చించి కూడేరు మండలంలో సమగ్ర రక్షిత తాగునీటి పథకాన్ని నిర్మించారు. దీని పనులు గత యేడాదే పూర్తి అయ్యాయి. దీనికి సంబంధించిన ట్రయిల్‌రన్‌ కుడా విజయవంతంగా పూర్తి చేశారు. ప్రజలు కుడా ఇక తమకు తాగునీటి కష్టాలు తీరతాయని భావించారు. అయితే నేటివరకు ఈ పథకాన్ని ప్రారంభంచడంలో ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. ముఖ్యంగా ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి, ఆయన సోదరుడు అడ్డుపడటం వల్లే ఈ తాగునీటి పథకం నేటిని ప్రారంభం కావడం లేదని ఉరవకొండ నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.

ప్రారంభిస్తే జనం దాహం తీరినట్టే !
కూడేరు మండలంతో పాటు ఉరవకొండ, వజ్రకరూర్‌ మండలాల్లోని 40 గ్రామాలతో పాటు అనంతపురం రూరల్‌ పరిధిలోని పలు గ్రామాలకు తాగునీరు అందించేందుకు 2013లో ఈపథకం ప్రారంభించారు. రూ. 56 కోట్లు వెచ్చించి నిర్మించిన ఈ పథకం పనులు గత యేడాది పూర్తయ్యాయి. కూడేరు మండలం పీఎబీఆర్‌ జలాశయం వద్ద ఊట బావిని నిర్మించి అక్కడి నుండి నీటిని సమీపంలో నిర్మించిన సంప్‌ల ద్వారా పైప్‌లైన్‌ల నుండి సరఫరా చేయాల్సి ఉంది. తాగునీటిని అందించడానికి దాదపు 130 కిమీ మేర పైప్‌లైన్‌ను కూడా ఏర్పాటు చేశారు. రోజుకు 7 మిలియన్‌ లీటర్ల నీరు ఈ పథకానికి అవసరమవుతుందని అధికారులు తేల్చారు. గత యేడాది సెప్టెంబర్‌లో పనులు పూర్తవడంతో డిసెంబర్‌ నెలలో అధికారులు ట్రయిల్‌రన్‌ను విజయవంతంగా నిర్వహించారు. అయినప్పటికి తాగునీటి పథకాన్ని మాత్రం ప్రారంభించలేక పోయారు.

ఎమ్మెల్యే పోరాటం
రూ. 56 కోట్ల వ్యయంతో నిర్మించిన తాగునీటి పథకాన్ని వెంటనే ప్రారంభించాలంటూ స్థానిక ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డి విస్తృతంగా పోరాడుతూ ప్రభుత్వం పై ఒత్తిడి తెచ్చారు. వేలాది మందితో పీఏబీఆర్‌ వద్ద ఉన్న తాగునీటి పథకాన్ని ప్రారంభించేందుకు వెళ్లగా ఎమ్మెల్యేతో పాటు మిగిలిన వారిని కూడా ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఆ తర్వాత అనంతపురంలోని ఆర్‌డబ్ల్యూఎస్‌ కార్యాలయాన్ని ముట్టడించారు. అయినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం రావడం లేదు.

అడ్డుపడే వారికి బుద్దిచెబుతాం
- గౌరమ్మ,  కురుట్లపల్లి
తాగునీరు కోసం ప్రజలు పడే కష్టాలు అన్నీ నాయకులకు తెలుసు. అయినా నీళ్లు ఇవ్వకుండా అడ్డుపడతున్నారు. అలాంటి వారికి తప్పకుండా బుద్ది చెబుతాం. పథకం పూర్తి అయినా నీళ్లు ఇవ్వడానికి మీకు మనస్సు రాదా.

నీళ్లు ఉన్నా వాడుకోలేని దుస్థితి
- లక్ష్మిదేవి, అంతరగంగ
మా గ్రామానికి దగ్గరగా డ్యాం ఉన్నా మాకు గుక్కెడు తాగునీరు అందని దుస్థితి నెలకొంది.  పనులన్నీ వదులుకోని నీళ్ల కోసం ఆరాటపడాల్సిన పరిస్థితి. మా బాధలు ప్రభుత్వానికి పట్టలేదు.

మరిన్ని వార్తలు