సిప్లాన్‌... పరేషాన్‌ ! | Sakshi
Sakshi News home page

సిప్లాన్‌... పరేషాన్‌ !

Published Tue, Jul 25 2017 10:37 PM

సిప్లాన్‌... పరేషాన్‌ ! - Sakshi

- ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న సిప్లాన్‌ డ్రగ్స్‌ కంపెనీ
- రసాయనాలు నేరుగా భూమిలోకి విడుదల
- స్వచ్ఛమైన నీరుకూడా విషంగా మారుతున్న వైనం
- బీళ్లుగా మారిన వందలాది ఎకరాలు


అనంతపురం రూరల్‌ : సిప్లాన్‌ డగ్స్‌ ఈ ఫ్యాక్టరీ ఈ పేరు వింటేనే చుట్టుపక్కల గ్రామల ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి రోజూ ఫ్యాక్టరీ నుంచి వెలువడే రసాయనాలు, విష వాయువులతో అల్లాడిపోతున్నారు. ఆ ఫ్యాక్టరీ దెబ్బకు వందల ఎకరాల భూములు సైతం బీడుగా మారిపోయాయి.

నగరానికి కూతవేటు దూరంలో..
అనంతపురం నగరానికి కూతవేటు దూరంలో రాచానపల్లి వద్ద దాదాపు 12 ఏళ్ల క్రితం సిప్లాన్‌ డ్రగ్స్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారు.  ఇక్కడ వెటర్నరీ మందులను ఉత్పత్తి చేస్తారు. మందుల ఉత్పత్తి అనంతరం వెలువడే రసాయనాల వ్యర్థలాతో నీరు మొత్తం కలుషితమై పర్యావరణం దెబ్బతినే ప్రమాదం ఉందని మేధావులు, రైతులు తమ వాణి ని  ఫ్యాక్టరీ స్థాపించే తొలినాళ్లలోనే బలంగా వినిపించినా..   అధికార  యంత్రాంగం ప్రజల వాణిని పరిగణలోకి తీసుకోలేదు.

రైతుల భూములన్నీ బీడే
సిప్లాన్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుతో  పరిశ్రమ చుట్టూ ఉన్న వందల ఎకరాల్లోని పంటల భూములు మొత్తం  బీడుగా మారిపోయాయి. ఆ పోలాల్లోకి వచ్చే నీరు పంటల సాగుకు ఆమోద యోగ్యం కాదని నీటి పరీక్ష కేంద్రాలు తేటతెల్లం చేశాయి. ఆశ చావక చాలా మంది రైతులు రూ. లక్షలు పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేసినా వారికి నిరాశే మిగిలింది. దీంతో అప్పుల ఊబిలో  కూరుకుపోయి ప్రస్తుతం పంట విరమణ ప్రకటించేశారు.

నీరు కలుషితం అవుతోంది ఇలా..
ఫ్యాక్టరీలో మందుల ఉత్పత్తి అనంతరం వచ్చే రసాయనాలను ఫ్యాక్టరీ యాజమాన్యం రిగ్గులను ఏర్పాటు చేసి భూగర్భంలోకి పంపిస్తున్నారు. ఇలా భూమిలోకి వెళ్లిన రసాయనాల వ్యర్థాలు నీటిలో కలిసిపోతున్నాయి. రసాయనాలను బయటకు వదిలేస్తే స్థానిక ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందనే భయంతో యాజమాన్యం కొన్ని సంవత్సరాలుగా ఇలా చేస్తోంది. దీని ఫలితంగా భూగర్భంలోని జలాలు మొత్తం కలుషితమైపోయి విషనాన్ని కక్కుతున్నాయి.

ప్రాణాలు పోకముందే మేల్కోవాలి
రసాయన వ్యర్థాలతో కలుషితమైన నీటిని ప్రజలు ప్రతి రోజూ తాగుతూ రోగాల బారిన పడుతున్నారు. ఈ తంతు ఇలాగే కొనసాగితే భవిష్యత్‌లో ప్రజల ప్రాణాలకు పెనూ ప్రమాదం వాటిల్లే ప్రమాదం ఉంది.  వెంటనే అధికార యంత్రాంగం మేల్కొని తాగునీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు వేడుకుంటున్నారు.

నీరు కూడా దుర్వాసనే
– లింగమయ్య, కొడిమి గ్రామం
గ్రామంలోకి సరఫరా అయ్యే తాగునీరు మొత్తం దుర్వాసన వస్తోంది. ఈ నీటిని తాగి ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి.

ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలి
- రమణారెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు, రాచానపల్లి
సిఫ్లాన్‌ ఫ్యాక్టరీతో రైతుల భూములన్నీ బీళ్లుగా మారాయి. భూగర్భ జలాలు కూడా కలుషితం కావడంతో ప్రజలు కూడా రోగాల బారిన పడుతున్నారు.  వెంటనే అధికారులు స్పందించి ఫ్యాక్టరీని సీజ్‌ చేయాలి.

Advertisement
Advertisement