ఏకంగా డీఎస్పీ భూమినే..

26 Aug, 2016 00:09 IST|Sakshi

అనంతపురం సెంట్రల్‌ : ఇతరుల భూములను తమ పేరు మీదుగా చిత్రీకరించి విక్రయించాలని చూశారు.. కొందరు ప్రబుద్ధులు. అయితే ఆ స్థలం పోలీస్‌ డీఎస్పీది అని గుర్తించలేకపోయారేమో.. చివరకు పోలీసులకు అడ్డంగా దొరికి కటకటాలపాలయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను వన్‌టౌన్‌ సీఐ రాఘవన్‌తో కలిసి డీఎస్పీ మల్లికార్జున వర్మ గురువారం విలేకరులకు వివరించారు.  కె.రవికుమార్‌ తిరుపతిలో డీఎస్పీగా పనిచే స్తున్నారు. ఆయన తండ్రి నారాయణస్వామి పేరిట నగరంలో బైరవనగర్‌లో (సర్వేనెంబర్‌ 400లోని 36, 37)లో పది సెంట్ల స్థలం ఉంది. ఇటీవల తన భూమిని ఎవరో చదును చేసి ఆక్రమించుకోవాలని చూస్తున్నారని డీఎస్పీ వన్‌టౌన్‌ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు.

కేసు నమోదు చేసిన పోలీసులు కూపీ లాగితే అసలు విషయం బయటపడింది. ధర్మవరానికి చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బ్రహ్మానందరెడ్డి, కృష్ణారెడ్డి డాక్యుమెంట్‌ రైటర్‌ కోటప్పతో కలిసి చాలా కాలంగా లావాదేవీలు జరగని ప్లాట్లను తమవిగా చిత్రీకరించి విక్రయించడానికి యత్నించారు. వీరంతా ధర్మవరానికి చెందిన నారాయణస్వామి, అతని కొడుకు ఈశ్వరయ్యను పిలిచుకుని అక్కడి డాక్యుమెంట్‌ రైటర్‌ శివశంకర్‌ సాయంతో శాశ్వత ఖరారునామా చేయించారు. తర్వాత ఆ ప్లాట్లను తాడిపత్రి మండలం తిప్పారెడ్డిపల్లికి చెందిన లింగుట్ల నరసింహులుకు రూ.14.52 లక్షలకు అమ్మి ఈ ఏడాది జూన్‌ 9న రిజిస్టర్‌ ఆఫీసులో రిజిస్టర్‌ చేయించారు. ప్లాట్లు కొనుగోలు చేసిన నరసింహులు స్వాధీనం చేసుకునే క్రమంలో విషయం డీఎస్పీ దృష్టికి వెళ్లింది. విచారణ చేయగా అసలు నిందితులు బయటపడ్డారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు వెంకటరమణ, రంగడు, సిబ్బంది పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు