క్రీడాభిరుచులను ఆస్వాదించండి

16 May, 2017 00:19 IST|Sakshi
క్రీడాభిరుచులను ఆస్వాదించండి
  •  ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌
  • అనంతపురం సప్తగిరి సర్కిల్‌ :

    క్రీడలు అభిరుచులని, వాటిని ఆస్వాదించాలని ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంచో ఫెర్రర్‌ సూచించారు. స్థానిక అనంత క్రీడా గ్రామంలో సోమవారం ఏషియన్‌ ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌(ఏఎఫ్‌సీ) గ్రాస్‌ రూట్స్‌ ఫెస్టివల్‌ - 2017ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెర్రర్‌ మాట్లాడుతూ అనంతపురం స్పోర్ట్స్‌ అకాడమీ ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌లో ఒక భాగమన్నారు. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న గ్రాస్‌ రూట్స్‌డేను మన అనంత క్రీడా గ్రామంలో నిర్వహించడం హర్షించదగ్గ విషయమన్నారు. ఫుట్‌బాల్‌పై ఆసక్తి కలిగించేందుకు ఉద్దేశించిన గ్రాస్‌రూట్స్‌డేను నిర్వహించేందుకు ఆల్‌ ఇండియా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ దక్షిణ భారతదేశంలో అనంతకే అవకాశం కల్పించిందన్నారు.

    అనంతలో ఇలాంటి రోజును ఇంతమంది క్రీడాకారుల సమక్షంలో జరుపుకోవడం చాలా గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా ఫుట్‌బాల్‌ అండర్‌ - 10, 12 విభాగాలకు జిల్లాలోని 20 మండలాల నుంచి 600 మంది క్రీడాకారులను ఎంపిక చేశామని, అండర్‌ - 14, 16 విభాగాలకు చేరే సమయానికి వారిని ఉన్నతమైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. క్రీడాకారులకు మెలకువలు చాలా అవసరమని, వాటిని వివరిస్తే వారి ఆటతీరును మెరుగుపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ అ«ధ్యక్షుడు గోపాలకృష్ణ, జిల్లా ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి నాగరాజు, ఉపాధ్యక్షుడు వేణుగోపాల్, ఏపీ కోచ్‌ జాకీర్‌ హుస్సేన్, అకాడమీ కోచ్‌లు దాదా ఖలందర్, రియాజ్, విజయభాస్కర్, వైద్యులు సయ్యద్‌ హుస్సేన్‌ తదితరులు పాల్గొన్నారు.

     

మరిన్ని వార్తలు