వ్యాధుల నియంత్రణలో టీడీపీ ప్రభుత్వం విఫలం

12 Jul, 2017 12:30 IST|Sakshi
వ్యాధుల నియంత్రణలో టీడీపీ ప్రభుత్వం విఫలం

► మాజీ మంత్రి బాలరాజు ధ్వజం
► 14న పాడేరులో కాంగ్రెస్‌ మహాధర్నా
►  రానున్న ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి


హుకుంపేట : విశాఖ ఏజెన్సీలో వ్యాధుల నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, డీసీసీ అధ్యక్షుడు పసుపులేటి బాలరాజు ఆరోపించారు. మంగళవారం ఆయన హుకుంపేట మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. వ్యాధుల నియంత్రణలో ముందస్తు చర్యలు చేపట్టకపోవడంతో, మలేరియా, ఇతర వ్యాధులు విజృంభించి, గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. గిరిజన ప్రాంతాలలో మరణాలు సంభవిస్తున్నా ముఖ్యమంత్రి చంద్రబాబుకు పట్టడం లేదన్నారు.

గిరిజన ప్రాంతాలలో విలువైన ఖనిజ సంపద, వనరులపై మాత్రమే చంద్రబాబుకు ప్రేమ ఉందన్నారు. టీడీపీ ప్రభుత్వం అవలింభిస్తున్న గిరిజన వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈనెల 14న పాడేరులో మహాధర్నా  చేపడుతున్నామని, ఈ కార్యక్రమానికి ఏపీ పీసీసీ అ«ధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఇతర రాష్ట్ర, జిల్లా నాయకులు హాజరవుతున్నారని ఆయన తెలిపారు. అరకు, పాడేరు నియోజకవర్గాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి, మహాధర్నాను విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ మహిళా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షురాలు కె.బి.సావిత్రి, మండల మహిళా అధ్యక్షురాలు కొర్ర సరస్వతి, పాడేరు మండల పార్టీ అధ్యక్షుడు మినుముల కన్నాపాత్రుడు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు