22 కిలోల గంజాయి పట్టివేత

10 Aug, 2016 23:20 IST|Sakshi
గంజాయితో పట్టుబడ్డ ముగ్గురు మహిళలతో టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది
 
శంగవరపుకోట : గంజాయి స్మగ్లింగ్‌తో కొత్తదారులు వెతుకుతున్నారు. నిన్నటి వరకూ గంజాయి రవాణాలో పాత్రధారులైన మగరాయుళ్లను కాదని స్మగ్లర్లు ఇప్పుడు మహిళల్ని పావులుగా చేసి గంజాయి రవాణాకు ఉసిగొల్పుతున్నారు. విజయనగరం ఈఎస్‌టీఎఫ్‌ బందం సిబ్బంది, స్థానిక ఎక్సైజ్‌ అధికారులతో కలిసి బుధవారం సాయంత్రం బొడ్డవర జంక్షన్‌లో నిర్వహించిన రూట్‌వాచ్‌లో అక్రమంగా తరలుతున్న సుమారు 22కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆ వివరాలను సీఐ ఎం.ఎస్‌.ఎన్‌.వి.మణి తెలిపారు. రెగ్యులర్‌ రూట్‌వాచ్‌లో భాగంగా బొడ్డవర జంక్షన్‌లో వాచ్‌ చేస్తుండగా ఆర్టీస్‌ బస్‌ దిగిన ముగ్గురు మహిళలు నెత్తిపై గోనెమూటలతో వస్తున్నారు. వారితో పాటు ఇద్దరు బాలికలు ఉన్నారని తెలిపారు. వారిని అనుమానించి పట్టుకుని గోనె మూటలు తనిఖీ చేయగా అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. గంజాయి తూకం వేయగా 21కిలోల 800 గ్రాములు బరువున్నట్టు చెప్పారు. మహిళలు తమ పేర్లు తురురాంప్యారీ, శాంతిలాల్, అనితాసింగ్‌ అని, విశాఖ రైల్వే స్టేషన్‌ప్రాంతంలో ఉంటామని మాత్రం చెప్పారన్నారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నామని, వీరిని గురువారం కోర్టుకు హాజరు పరుస్తామని చెప్పారు. తనిఖీలో ఆమె వెంట ఎస్‌ఐ శంకర్‌కుమార్, హెచ్‌సి సిహెచ్‌.ఎస్‌.పి.రావు, జైరామ్‌నాయుడు తదితర సిబ్బంది పాల్గొన్నారని చెప్పారు. 
 
మరిన్ని వార్తలు