పురుగుల మందే పెరుగన్నమాయెనా..

5 Sep, 2017 09:54 IST|Sakshi
పురుగుల మందే పెరుగన్నమాయెనా..

అప్పుల బాధతో రైతు బలవన్మరణం
ఆలస్యంగా వెలుగులోకి కుళ్లిన మృతదేహం
మిన్నంటిన కుటుంబ సభ్యుల రోదనలు


భీమదేవరపల్లి(హుస్నాబాద్‌):
అప్పుల బాధ ఓ రైతును ఆత్మహత్య వైపు నడిపించింది. కుటుంబ పోషణ, పెట్టుబడి కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో ఆ రైతుకు ఆత్మహత్యే శరణ్యమైంది. పంటకు మేలు చేయాల్సిన పురుగుల మందు ఆ రైతు ఇంటికి కీడు చేసింది. భీమదేవరపల్లి మండలం బొల్లొనిపల్లికి చెందిన ఊదర వెంకటయ్య (55)అనే రైతు ఆత్మహత్యకు పాల్పడిన దుర్ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు..

అప్పుల బాధతో..
భీమదేవరపల్లి మండలం బొల్లొనిపల్లికి చెందిన ఊదర వెంకటయ్యకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉంది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు పండకపోవడంతో పూటగడవక, ఇంటి అవసరాల కోసం పదేళ్ల క్రితం ఖమ్మం జిల్లా పాల్వంచకు వెళ్లాడు. అక్కడే హమాలీగా పనిచేస్తూ మూడేళ్ల పాటు అక్కడే ఉన్నాడు. అనంతరం ఇంటికొచ్చిన ఏడాది పాటు ఊళ్లోనే జీతం ఉన్నాడు. భార్య, భర్త కూలి పనులు చేసుకుంటూ తెలిసిన వారి వద్ద అప్పులు తెచ్చి ముగ్గురు కూతుళ్ల వివాహాలు చేశారు.

పెళ్ళిళ్లు, పంటల పెట్టుబడుల కోసం రూ.2లక్షలపైగా అప్పులు చేశాడు. ఈ ఏడాది ఖరీఫ్‌లో తనకున్న రెండెకరాల భూమిలో ఎకరంలో పత్తి మరో ఎకరంలో వరి పంట సాగు చేశాడు. పెట్టుబడుల కోసం 40వేల వరకు అప్పు తెచ్చాడు. కానీ పత్తి పంటకు తెగుళ్లు సోకడంతో మూడుసార్లు క్రిమిసంహారక మందు కొట్టాడు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు. దీంతో అప్పు తేరేలా లేదని భావించి వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి అక్కడే ఉన్న క్రిమి సంహారక మందు డబ్బాను తీసుకొని సమీపంలోని బూడిద గుట్టపైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బాయికాడికి పోయివస్తానని...
ఈ నెల 2న ఉదయం ఇంటి నుంచి వెళ్తూ బాయికాడికి పోయివస్తానని భార్య భాగ్యమ్మ చెప్పిన వెంకటయ్య తిరిగి ఇంటికి రాలేదు. మధ్యాహ్నం వరకు కూడా భర్త ఇంటికి రాకపోవడంతో భాగ్యమ్మ సద్ది(అన్నం) పట్టుకొని బాయి వద్దకు వెళ్లింది. బావి వద్ద కూడా వెంకటయ్య లేకపోవడంతో ఇంటికొచ్చిన భాగ్యమ్మ బంధువుల ఇంటికి వెళ్లాడనుకొనుంది. ఆదివారం బంధువుల ఇళ్లల్లో కూడా లేకపోవడంతో అనుమానం వచ్చి గ్రామానికి చెందిన బంధువులను తీసుకొని బావి సమీపంలోని బూడిద గుట్టపై వెతికింది. గుట్టపై మృతదేహాన్ని చూసి వారు నిర్ఘాంతులయిపోయారు. అప్పటికే మృతదేహం కుళ్లిపోయి దుర్వాసన రాసాగింది..

మృతుడికి భార్య, కూతుళ్లు సరిత, సంధ్య, ఉమ ఉన్నారు. కాగా మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హుజురాబాద్‌ ఆస్పత్రికి తరలించినట్లు హెడ్‌కానిస్టేబుల్‌ మల్లారెడ్డి, యాదగిరి తెలిపారు.

‘బాయికాడికి పోయివస్తానని మమ్ముల్ని ఒదిలి భగవంతుడి దగ్గరకు పోయవా అయ్యా.. మేమెట్ల బతకాలి అయ్యా’ అంటూ మృతుడి భార్య భాగ్యమ్మ రోదించిన తీరు పలువురిని కంటతడిపెట్టించింది.

మరిన్ని వార్తలు