రోడ్డుప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం

26 Apr, 2016 08:20 IST|Sakshi
రోడ్డుప్రమాదాల్లో ఏడుగురి దుర్మరణం

రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ల్లోని రహదారులు రక్తమోడాయి. పలు జిల్లాల్లో మంగళవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డుప్రమాదాల్లో ఏడుగురు మృతిచెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

కావలి: నెల్లూరు జిల్లా కావలి సమీపంలోని గౌరవరం వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి నెల్లూరు వెళుతున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుల వివరాలతో పాటు ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

తుని: తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు మహిళలు మృతి చెందారు. తుని మండలం జగన్నాథపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. గండేపల్లి మండలం గోపాలపురం గ్రామానికి చెందిన సింహాచలం, రమణమ్మ అనే ఇద్దరు మహిళలు మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాధమిక వైద్యం అందించారు. క్షతగాత్రులను మెరుగైన వైద్యం కోసం కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

నంద్యాల: కర్నూలు జిల్లాలో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్ మృత్యువాతపడ్డాడు. తిరుపతికి చెందిన మేఘన ట్రావెల్స్ బస్సు సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి తిరుపతి వైపు ప్రయాణికులతో వెళుతోంది. తెల్లవారుజామున ఆ బస్సు నంద్యాల శివారులోని మిల్స్ డెయిరీ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ యోగానందరెడ్డి అక్కడికక్కడే చనిపోగా బస్సులోని ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే నంద్యాల ఆస్పత్రికి తరలించారు.

చిత్తూరు: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం వద్ద మంగళవారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఇద్దరు చనిపోయారు. చిత్తూరు నుంచి పలమనేరు వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొట్టింది. ఈఘటనలో కారు డ్రైవర్, ఐదేళ్ల చిన్నారి అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.
 

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు