పౌర్ణమి రోజున చీకట్లు

17 Sep, 2016 01:42 IST|Sakshi

మహాలయ పౌర్ణమి రోజున నాలుగు కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. అందరూ సంతోషంగా పండుగ జరుపుకుంటున్న వేళ రోడ్డు ప్రమాద రూపంలో నలుగురిని మృత్యువు కబళించింది. బంధువుల ఇంటికి వెళ్లి వస్తూ ఓ యువకుడు.. రోడ్డు మలుపులో అదుపుతప్పి ఓ వ్యక్తి.. ట్రాక్టర్‌ బోల్తా పడి మరొకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలతో ఆయా కుటుంబాల్లో విషాదం నెలకొంది.


టిప్పర్‌ ఢీకొని ఇద్దరు యువకులు..
చెన్నేకొత్తపల్లి మండలం యర్రంపల్లి వద్ద శుక్రవారం సాయంత్రం టిప్పర్‌ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. పోలీసులు,బంధవులు తెలిపిన మేరకు... ఆత్మకూరు మండలం తోపుదుర్తికి చెందిన యువకులు రామ్మూర్తి (28), వెంకటేష్‌ (26) ద్విచక్రవాహనంలో చెన్నేకొత్తపల్లి మండలం చిన్నపల్లి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ పని ముగించుకొని స్వగ్రామానికి బయలు దేరారు. యర్రంపల్లి జంక్షన్‌ వద్దకు రాగానే వారి ద్విచక్రవాహనాన్ని ఎస్‌ఆర్‌సీ కంపెనీకి చెందిన టిప్పర్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటేష్‌ అక్కడికక్కడే మృతి చెందగా.. రామ్మూర్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఎస్‌ఐ మహమ్మద్‌ రఫీ సంఘటనా స్థలానికి చేరుకుని రామ్మూర్తిని  హుటాహుటిన పోలీస్‌ వాహనంలో ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం అనంతపురంలోని ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించడంతో రాత్రి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.

కర్ణాటక వాసి ..
మడకశిర మండలం గోవిందాపురం రోడ్డు మలుపు వద్ద శుక్రవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక వాసి ఒకరు మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. కర్ణాటక రాష్ట్రం పావగడ తాలూకా గంగవరానికి చెందిన క్రిష్టప్ప (45), రొళ్ల మండలం గుడ్డుగుర్కికి చెందిన రామాంజినేయులు ద్విచక్రవాహనంలో మడకశిరకు వస్తుండగా గోవిందాపురం రోడ్డు మలుపులో కిందపడిపోయారు. తీవ్రంగా గాయపడిన వీరిని స్థానికులు 108 ద్వారా మడకశిర ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే క్రిష్టప్ప మృతి చెందాడు. రామాంజినేయులు చికిత్స పొందుతున్నాడు. వీరు అదుపు తప్పి కిందపడ్డారా.. లేక ఏదైనా వాహనం ఢీకొందా అనేది తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

ట్రాక్టర్‌బోల్తా పడి ఒకరు..
వజ్రకరూరు మండలం గూళ్యపాళ్యం సమీపంలో శుక్రవారం సాయంత్రం పొలంలో అడ్డు వేసేందుకు ట్రాక్టర్‌లో రాళ్లు తీసుకు వస్తుండగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో గ్రామానికి చెందిన షెక్షావలి(40)పై రాళ్లు పడ్డాయి. తీవ్రంగా గాయపడిన అతడిని చుట్టుపక్కల వారు గమనించి గుంతకల్లు ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గం మధ్యలోనే అతను మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వజ్రకరూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య నూర్జహాన్‌తోపాటు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మ ండల కోఆప్షన్‌ సభ్యుడు పీర్‌బాషా, సీపీఎం మండల కన్వీనర్‌ విరూపాక్షి తదితరులు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మరిన్ని వార్తలు