ప్రొఫెసర్లచే రోడ్ల నాణ్యత తనిఖీలు

5 Oct, 2016 21:44 IST|Sakshi

సాక్షి,సిటీబ్యూరో:  నగరంలో చేపట్టనున్న రోడ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలను తనిఖీ చేసేందుకు  ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (హైదరాబాద్‌), జేఎన్‌టీయూ,  ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లను కోరుతూ ఆయా విశ్వవిద్యాలయాలకు జీహెచ్‌ఎంసీ  లేఖలు రాసింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరంలో రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ నేపథ్యంలో  విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్ల పర్యవేక్షణలో పనులను చేపట్టాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ డా.బి.జనార్దన్ రెడ్డి నిర్ణయించారు. నగరంలో రూ.  50కోట్ల  వ్యయంతో రోడ్ల నిర్మాణాలను చేపట్టేందుకు బల్దియా నిర్ణయించగా ఇప్పటి వరకు రూ.  23కోట్ల పనులకు టెండర్లు పూర్తయ్యాయి.  మరో వారం రోజుల్లోగా మిగిలిన రోడ్ల టెండర్లు పూర్తి కానున్నాయి.

నాణ్యత విషయంలో విమర్శలను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ ప్రమేయంలేని ఇంజనీరింగ్‌ నిపుణులచే ఈ పనులను తనిఖీ చేయించాలని నిర్ణయించారు.  ర్యాండమ్‌గా తనిఖీలు చేయించి,   నాణ్యత ప్రమాణాలను పాటించని కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టడంతో పా టు  పనులను పర్యవేక్షించే ఇంజనీరింగ్‌ అధికారులపై కూ డా కఠిన చర్యలు చేపట్టనున్నట్లు కమిషనర్‌ పేర్కొన్నారు.


 

మరిన్ని వార్తలు