సుగర్‌ రోగుల ‘పంట’ పండింది..

21 Oct, 2016 02:00 IST|Sakshi
సుగర్‌ రోగుల ‘పంట’ పండింది..
తణుకు టౌన్‌ : మధుమేహవ్యాధి గ్రస్తులు కడుపునిండా అన్నం తినేందుకు ఓ రైతన్న వినూత్న సాగు చేపట్టాడు. సుగర్‌లెస్‌ వరి సాగుచేస్తూ ఆదర్శంగా నిలిచాడు. తణుకు పరిధిలోని టి.వేమవరానికి చెందిన రైతు గుబ్బల నరసింహారావు కర్ణాటక రాష్ట్రంలో సాగు చేస్తున్న సుగర్‌ లెస్‌ వరి వంగడాన్ని తీసుకువచ్చి పంట పండిస్తున్నాడు. సుగర్‌లెస్‌ 15038 రకాన్ని తణుకులోని సుమారు 4 ఎకరాల్లో సార్వా పంటగా సాగు చేస్తున్నాడు. కర్ణాటకలోని రాయచూర్‌లో పండించే ఈ వరి రకాన్ని తణుకు పరిసరాలలో మొట్టమొదటి సారిగా వ్యవసాయ క్షేత్రంలో ప్రయోగాత్మకంగా వేసినట్టు నరసింహారావు చెప్పారు. ఇది సార్వా, దాళ్వా పంటలకు అనుకూలమైన వంగడమని తెలిపారు. సుగర్‌ వ్యాధిగ్రస్తులు సైతం ఆహారంగా తీసుకునే విధంగా ఇది పూర్తి సుగర్‌ ఫ్రీ రైస్‌ అని చెప్పారు. తణుకులో సాగు చేస్తున్న ఈ విత్తనం వచ్చే దాళ్వా నాటికి మరింత మంది రైతులకు విక్రయించి సాగు విస్తీర్ణం పెరిగేలా చేయనున్నట్టు వివరించారు. ప్రస్తుతం నాలుగున్నర అడుగుల మేర పంట పెరిగిందని, కంకి కూడా సుమారు అడుగున్నర వరకూ పెరిగిందని చెప్పారు. దిగుబడి 45 నుంచి 50 క్వింటాళ్ల మధ్య ఉంటుందన్నారు. ప్రస్తుతం వరి ఈనిక దశ పూరై్త పాలు పోసుకునే దశలో ఉందన్నారు. 
కర్ణాటకలోని రాయచూర్‌ ప్రాంతంలో బంధువుల ద్వారా ఈ విత్తనాన్ని సేకరించినట్టు చెప్పారు. ఇది మామూలు సన్న రకం సోనా మసూరు కంటే సన్నగా ఉంటుందన్నారు. పంట కాలం 145 రోజులని, సాధారణ వాతావరణ పరిస్థితులను తట్టుకుని తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి ఇస్తుందని చెప్పారు. ఇప్పటి వరకూ ఒక్కసారి మాత్రమే ఎరువులు, పురుగుమందులు వినియోగించినట్టు చెప్పారు. 
 
మరిన్ని వార్తలు