వేరుశనగ రైతులను ఆదుకోవాలి

25 Aug, 2016 23:46 IST|Sakshi

రాప్తాడు: ఖరీఫ్‌లో వేరుశనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.పెద్దిరెడ్డి డిమాండ్‌ చేశారు. రైతు సంఘం నాయకులతో కలిసి గురువారం ఆయ న రాప్తాడుకు చెందిన కౌలు రైతు కాటమయ్య ఏడు ఎకరాల్లో సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఇప్పటి వరకు పంట పెట్టుబడి కోసం రూ.1.50 లక్షలు అప్పు చేసి ఖర్చు పెట్టినట్లు ఈ సందర్భంగా రైతు వారి దృష్టికి తీసుకువచ్చారు. వర్షాలు రాకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయిందని, అప్పులు ఎలా తీర్చాలో అర్థం కావడం లేదం టూ వాపోయాడు.

ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో 15 లక్షల ఎకరాల్లో వేరుశనగను రైతులు సాగు చేస్తున్నారని తెలిపారు. వర్షం రాకపోవడంతో పంట పూర్తిగా ఎండిపోయిందన్నారు. గతంలో పంట నష్టపోతే బీమా పరిహారం ద్వారా లబ్ధి చేకూరేదని, ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో పంటల బీమా కూడా అందడం లేదని తెలిపారు. వేలాది మంది రైతులు పంట నష్టపోతే వంద ల సంఖ్యలో మాత్రమే ఇన్‌పుట్‌ సబ్సి డీ మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు.

పంట నష్టపోయిన ప్రతి రైతుకూ రూ. పది వేలు పరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో రాప్తాడు డివిజన్‌ రైతు సంఘం నాయకులు కదిరప్ప, రామాంజినేయులు, చంద్రశేఖరరెడ్డి, ఎర్రిస్వామిరెడ్డి, పుల్లలరేవు గోపాల్, నాగేంద్ర, నారాయణ, హనుమంతరెడ్డి, పుల్లప్ప, బీరప్ప, మాధవరెడ్డి, యర్రపరెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు