మాయమాటలతో ప్రభుత్వ పాలన

1 Aug, 2016 23:51 IST|Sakshi
డీవీ, టీఎన్‌ చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పిస్తున్న మోహన్‌రెడ్డి
  •  ప్రజా ఉద్యమాలపై పోలీసుల ఉక్కుపాదం
  • ఐసీఎఫ్‌ఏ జాతీయ కార్యదర్శి మోహన్‌రెడ్డి
  • గొర్రెకుంటలో వెంకటేశ్వర్‌రావు, నాగిరెడ్డి సంస్మరణ సభ
  • పోచమ్మమైదాన్‌ : ప్రజలకు మాయమాటలు చెబుతూ పరిపాలన సాగిస్తున్న ప్రభుత్వాల కుఠిల నీతిని గ్రహించిన పేదలు తమ సమస్యల సాధన కోసం ఉద్యమిస్తుంటే పోలీసులతో అణిచివేస్తూ రాజ్యహింసకు పాల్పడుతున్నారని ఐసీఎప్‌ఏ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ మోహన్‌రెడ్డి ఆరోపించారు. వరంగల్‌ గొర్రెకుంటలో భారత కమ్యూనిస్టు విప్లవకారుల సమైక్యతా కేంద్రం ఆధ్వర్యంలో దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు(డీవీ), తరిమెల నాగిరెడ్డి(టీఎన్‌) సంస్మరణ సభ ఆదివారం రాత్రి జరిగింది.
     
    ఈ సభకు ఇల్లందుల శోభన్‌బాబు అధ్యక్షత వహించగా.. డీవీ, టీఎన్‌ చిత్రపటాలకు మోహన్‌రెడ్డి తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  ప్రజాస్వామ్య బద్దంగా హాలులో సమావేశాల నిర్వహణకు సైతం అనుమతులు ఇవ్వడం లేదని, ఇది పాలకుల నిర్బంద విధానంలో భాగమేనని విమర్శించారు. రాజ్యహింసకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమంచాల్సిన అవసరమేర్పడిందన్నారు. గత కొన్నేళ్లుగా దేశంలో పేద, మధ్య తరగతి ప్రజలు, రైతులకు సంబంధించి ఏ ఒక్క సమస్య పరిష్కారానికి నోచుకోలేదని పేర్కొన్నారు. అయినప్పటికీ మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన పాలకులు ప్రజా వ్యతిరేక, దోపిడీ విధానాలు అవలంబిస్తుండడంతో ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.
     
    నవోదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ నాయకుడు డాక్టర్‌ జవిన్‌ మాట్లాడుతూ ప్రజల బాగుకోసమని ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలన్నీ అవినీతి మయంగా మారాయని ఆరోపించారు. అభివృద్ధి పేరుతో ప్రవేశపెడుతున్న పథకాలు, వెచ్చిస్తున్న నిధులన్నీ వివిధ రూపాల్లో భూస్వాముల పెట్టుబడిదారులకే ఉపయోగపడుతున్నాయని విమర్శించారు. డాక్టర్‌ విజేందర్‌రావు మాట్లాడుతూ డీవీ, టీఎన్‌ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వారి చూపిన విప్లవమార్గంలో ప్రజలంతా సమీకృతమై పోరాడుతూ భూమి, ప్రజాస్వామ్యం, స్వాతంత్య్రాలను పోరాడి సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సభలో నాయకులు డాక్టర్‌ పాము రమేష్, ఉపేందర్, జన్ను అబ్రహం, అర్షం స్వామి, జి.కిషన్‌ తదితరులు పాల్గొన్నారు.
     
    బెదిరింపులు తగవు..
    గొర్రెకుంటలో జరిగిన డీవీ, టీఎన్‌ సంస్మరణలో పాల్గొన్న వారిని బెదిరించడం సరికాదని భారత కమ్యూనిస్టు విఫ్లవకారుల సమైక్యత కేంద్రం జిల్లా కార్యదర్శి కిషన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సభలో పాల్గొని తిరిగి వెళ్తున్న ప్రజలు, వారి వాహనాలను గీసుకొండ సీఐ అడ్డుకున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సభకు ఎందుకు వచ్చారు, ఎంత డబ్బు తీసుకున్నారంటూ ప్రశ్నించారని, మహిళలను సైతం బెదిరించారని పేర్కొన్నారు. ఇలాంటి బెదిరింపులు సరికాదని ఆయన తెలిపారు.
మరిన్ని వార్తలు