టీడీపీకి సన్‌స్ట్రోక్‌

30 Jun, 2017 13:49 IST|Sakshi
టీడీపీకి సన్‌స్ట్రోక్‌

► వచ్చే ఎన్నికల్లో చోడవరం నుంచి పోటీ చేస్తా
► బాంబు పేల్చిన మంత్రి గంటా తనయుడు
► ఇక్కడే రాజకీయం చేస్తానని ఎమ్మెల్యే రాజు కౌంటర్‌
► రవితేజ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం
► గంటాకు ప్రత్యేక వర్గం ఉండటంతో లోలోన కలవరం
► అధికార టీడీపీలో సరికొత్త రాజకీయం


సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న మంత్రి గంటా తనయుడు రవితేజ రాజకీయ వ్యాఖ్యలు.. దానికి చోడవరం ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ రాజు ఇచ్చిన కౌంటర్‌ టీడీపీలో కలకలం రేపుతున్నాయి. మంత్రి గంటాను ఇరకాటంలోకి నెట్టాయి.. చోడవరం నియోజకవర్గంలో చిచ్చు రగిల్చాయి.

సాక్షి, విశాఖపట్నం: ఆలూ లేదు.. చూలు లేదు.. కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది అధికార టీడీపీలో సీట్ల గోల. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నరకు పైగానే సమయమున్నా.. ఆ సీటు నాది.. ఈ సీటు నాది అంటూ ఇప్పటినుంచే నేతలు, వారి వారసులు కర్చీఫ్‌లు వేసేస్తున్నారు. తెరంగేట్రం చేసి సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు వారసుడు రవితేజ.. అక్కడితో ఆగకుండా రాజకీయాల్లోకి వస్తున్నట్టు చేసిన ప్రకటన అధికార పార్టీలో చిచ్చు రేపుతోంది. వచ్చే ఎన్నికల్లో చోడవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని ఆయన మీడియా ముందే బయటపడటంతో చోడవరం టీడీపీలో ముసలం ఏర్పడింది. గతంలో గంటా చోడవరం ఎమ్మెల్యేగా ఉండటం.. ఆయనకంటూ అనుచర వర్గం ఉండడంతో.. సిటింగ్‌ టీడీపీ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ రాజు వర్గీయుల్లో కలవరం మొదలైంది.ఎవరికి టికెట్‌ ఇచ్చినా నాకు అభ్యంతరం లేదని ఎమ్మెల్యే రాజు పైకి చెబుతున్నా.. అంతర్గత చర్చల్లో  తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం.

ఆర్నెల్ల క్రితం తండ్రి
సరిగ్గా ఆర్నెల్ల క్రితం గౌరీ మహోత్సవాల సందర్భంగా అనకాపల్లి వెళ్లిన మంత్రి గంటా శ్రీనివాసరావు రానున్న ఎన్నికల్లో తాను అనకాపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు తావిచ్చాయి. ఎంపీగా పీలా గోవింద్‌.. ఎమ్మెల్యేగా తాను పోటీ చేస్తామని ఎంపీ అవంతి శ్రీనివాస్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ‘గతంలో ఇక్కడ నుంచే పోటీ చేశా? కాబట్టి మరోసారి ఇక్కడ నుంచే ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలనుకుంటున్నా’ అని మంత్రి గంటా ప్రకటించారు. ఈ వ్యాఖ్యలు మింగుడుపడని స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద్‌ ‘అబ్బే అదేం లేదు.. మళ్లీ నేనే ఇక్కడి నుంచి పోటీ చేస్తాను’ అని కౌంటర్‌ ఇవ్వడం అప్పట్లో చర్చనీయాంశమైంది.

ఇప్పుడు తనయుడు..
తాను నటించిన జయదేవ్‌ చిత్రం విజయాన్ని కాంక్షిస్తూ చోడవరంలోని స్వయం భూ వినాయకుని ఆలయంలో గురువారం పార్టీ నేతలతో కలిసి రవితేజ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడే మీడియాతో చిత్ర విశేషాలు చెబుతూ.. తన రాజకీయ ఆకాంక్షను కూడా బయటపెట్టేశారు. ‘నా తండ్రిని ఆదరించిన చోడవరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉందని చెప్పుకొచ్చారు. స్వయంభూ వినాయకుని సన్ని« దిలో వెల్లడించినందున రవితేజ ఆకాంక్ష తప్పకుండా నెరవేరుతుందని పక్కనే ఉన్న పార్టీ నేతలు చెప్పుకొచ్చారు. గతంలో చోడవరం ఎమ్మెల్యేగా పని చేయడంతో గంటా శ్రీనివాసరావుకు ఇక్కడ ప్రత్యేకంగా అనుచరవర్గం ఉంది. రవి వ్యాఖ్యలు వీరిలో ఉత్సాహాన్ని నింపగా.. సిటింగ్‌ ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ రాజు వర్గీయుల్లో అలజడి, ఆగ్రహం రేపాయి. ఆయన నటించిన సినిమా ఇంకా విడుదలే కాలేదు. అప్పుడే తానేదో గొప్ప హీరోనైనట్టు.. ఆ దన్నుతో రాజకీయాల్లో రాణించేస్తానని భ్రమపడుతున్నారని మండిపడుతున్నారు. కాగా దీనిపై ఎమ్మెల్యే కేఎస్‌ఎన్‌ రాజు చోడవరంలోనే రాజకీయాలు చేస్తానని నర్మగర్భంగా తన అంతరంగాన్ని వెల్లడించడం.. టీడీపీలో వేడి పుట్టించింది.

‘రాజకీయాల్లోకి వస్తా.. తలరాత బాగుంటే వచ్చే ఎన్నికల్లోనే బరిలోకి దిగుతా. నాకు ఎంతో ఇష్టమైన చోడవరం నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని ఉంది. నాన్న లాగే నన్ను ఆదరిస్తారన్న ఆశపడుతున్నా.’ – రవితేజ, మంత్రి గంటా శ్రీనివాసరావు తనయుడు

చోడవరం వదిలిపోయే ప్రసక్తే లేదు
నేను పుట్టింది.. పెరిగింది.. రాజకీయాలు చేస్తున్నది.. అంతా చోడవరంలోనే. మళ్లీ టికెట్‌ ఇస్తే ఇక్కడే పోటీ చేస్తా. కాదని ఎవరికిచ్చినా అభ్యంతరం లేదు. నేను మాత్రం ఇక్కడే ఉండి రాజకీయాలు చేస్తా. –కేఎస్‌ఎన్‌ రాజు, టీడీపీ ఎమ్మెల్యే చోడవరం

మరిన్ని వార్తలు