పోలీస్‌స్టేషన్‌లో మిస్‌ఫైర్

2 Mar, 2016 00:08 IST|Sakshi
పోలీస్‌స్టేషన్‌లో మిస్‌ఫైర్

నల్లగొండ జిల్లా చందంపేట పోలీస్‌స్టేషన్‌లో ఘటన
 
 చందంపేట/హైదరాబాద్: చేతిలో ఉన్న గన్ మిస్‌ఫైర్ కావడంతో ఓ కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాడు. నల్లగొండ జిల్లా చందంపేట పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. 12వ బెటాలియన్‌కు చెందిన గొంగడాల వెంకటేశ్వర్లు చందంపేట పోలీస్‌స్టేషన్‌లో సెక్యూరిటీ పోలీస్‌గా పనిచేస్తున్నాడు. పీఏపల్లి మండలం మేడారం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు 2013లో ట్రైనింగ్ పూర్తి చేసి కొంతకాలం పాటు వేరే ప్రాంతంలో పనిచేశాడు. ఆ తర్వాత చందంపేట బదిలీ అయ్యాడు. మంగళవారం పోలీస్‌స్టేషన్ ఆవరణలో విధులు నిర్వర్తించిన వెంకటేశ్వర్లు మధ్యాహ్నం సమయంలో భోజనం కోసం తనకు కేటాయించిన గదిలోకి వెళ్లాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే గన్ పేలిన శబ్దం వినిపించడంతో పోలీస్‌స్టేషన్‌లో సిబ్బంది అప్రమత్తమయ్యారు.

ఈ సమయంలో స్టేషన్‌లో ఏం జరుగుతోందో కొద్ది సేపు అర్థం కాలేదు. సిబ్బంది శబ్దం వినిపించిన గదిలోకి వెళ్లిచూడగా వెంకటేశ్వర్లు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. వెంటనే అతడిని పోలీస్ వాహనంలోనే చందంపేట పీహెచ్‌సీకి తరలించారు. అక్కడి నుంచి దేవరకొండ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు బుల్లెట్ ఊపిరితిత్తుల నుంచి దూసుకెళ్లిందని చెప్పారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వెంకటేశ్వర్లును అక్కడి నుంచి హైదరాబాద్ ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వెంకటేశ్వర్లుకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో నుంచి బుల్లెట్ దూసుకెళ్లిందని, బుల్లెట్ శరీరంలోనే ఉందని, అయితే సీటీ స్కాన్లో బుల్లెట్ కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, మెరుగైన వైద్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.
 
 పెళ్లిపీటలు ఎక్కాల్సిన టైమ్‌లో
 నుదుట బాసికంతో పెళ్లి కొడుకుగా పెళ్లి పీటలెక్కాల్సిన సమయంలో వెంకటేశ్వర్లు ఆస్పత్రి పాలయ్యాడు. దీంతో పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో విషాదఛాయలు అలముకున్నాయి. కొడుకు కానిస్టేబుల్‌గా స్థిరపడ్డాడని తండ్రి హన్మంతు గుర్రంపోడు మండలం తెరాటిగూడెం గ్రామానికి చెందిన అమ్మాయితో కొద్దిరోజుల క్రితం వెంకటేశ్వర్లుకు పెళ్లి నిశ్చయించారు. ఈ నెల 5న వివాహం కావాల్సి ఉంది. కాగా, ఇది మిస్‌ఫైరా లేక ఆత్మహత్యాయత్నమా అని పోలీసులు, బంధువులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు డీఎస్పీ చంద్రమోహన్ తెలిపారు.

మరిన్ని వార్తలు