బోరుమంటున్నాయ్..

24 Mar, 2016 04:08 IST|Sakshi
బోరుమంటున్నాయ్..

జిల్లాలో 11,664 చేతి పంపులు
ఇందులో పాతిక శాతం కూడా పని చేయని వైనం
మరమ్మతులకు నిధులున్నా పట్టించుకునే వారు కరువు

కడప ఎడ్యుకేషన్ : ఈ ఏడాది వేసవి ప్రారంభంలోనే ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. చాలా ప్రాంతాల్లో బావులు ఎండిపోయాయి. బోరు బావులు మరమ్మతులకు గురయ్యాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని అధికారులు ఆర్భాటంగా ప్రకటనలైతే చేస్తున్నారు కానీ ఆచరణలో అది వాస్తవం కాదని స్పష్టమవుతోంది. చిన్న చిన్న మరమ్మతులు చేపడితే చాలా చోట్ల ప్రజలకు తాగు నీటిని అందించే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు స్పందించడం లేదు.

జిల్లాలో 11,664 చేతి బోర్లు ఉండగా వాటిలో పాతిక శాతం కూడా పని చేయడం లేదు. పదేళ్లుగా వీటి గురించి పట్టించుకునే నాథుడే లేడు. గ్రామీణ నీటి సరఫరా పథకం కింద చాలా గ్రామాల్లో ప్రత్యేకంగా  పైప్‌లైన్లు వేసి ప్రజలకు నీరు సరఫరా చేస్తున్నారు. ఇళ్లలోకే కుళాయిల ద్వారా నేరుగా నీరు వస్తుండటంతో చేతి పంపులకు ఆదరణ కరువైంది. కుళాయిల కంటే చేతి పంపుల నీరే సురక్షితం అని తెలిసినా వీటి గురించి ఎవరూ శ్రద్ధ వహించడం లేదు. వేసవి తీవ్రత పెరగడంతో ప్రస్తుతం చాలా గ్రామాల్లో రక్షిత మంచి నీటి పథకాలు పడకేశాయి.

ఈ స్థితిలో చేతి పంపులకు యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేయించాలని జిల్లాకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం రూ.50 లక్షలు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో అధికారులు వెంటనే చేతి బోర్ల పరిస్థితిపై వివరాలు తెప్పించుకుని వాటిని వాడకం లోనికి తీసుకొచ్చేందుకు నడుం బిగిస్తే నీటి సమస్యను కొంత మేరకు అధిగమించే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు