సిద్దిపేటను చూసి గర్వపడుతున్నా..

27 Apr, 2016 04:15 IST|Sakshi
సిద్దిపేటను చూసి గర్వపడుతున్నా..

కేంద్రం మన్ననలు పొందిన‘పేట’
వచ్చే యేడాది 5 అవార్డులు రావాలి మంత్రి హరీశ్‌రావు

 సిద్దిపేట జోన్ : సిద్దిపేట మండల పరిధిలోని ఇబ్రహింపూర్, లింగారెడ్డిపల్లి గ్రామాలతో పాటు మండల పరిషత్‌కు కేంద్రం మూడు అవార్డులను ప్రదానం చేయడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చిందని సిద్దిపేట ప్రజలు, అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో సాధించిన ఈ ఘనతను చూసి గర్వపడుతున్నానని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇటీవల ఢిల్లీలో మూడు అవార్డులను అందుకున్న అధికారుల, ప్రజాప్రతినిధులను మంగళవారం రాత్రి మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట ఆర్డీఓ కార్యాలయంలో ఘనంగా సన్మానించారు.

అంతకుముందు సిద్దిపేట ఎంపీడీఓ సమ్మిరెడ్డితో మాట్లాడుతూ అవార్డుల వివరాలు, కేంద్ర ప్రభుత్వ ఎంపిక ప్రమాణాలను, ఆయా గ్రామాల్లో సాధించిన లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రం పరిశుభ్రత, ప్రమాణికంగా తెలంగాణ రాష్ట్రానికి 7 అవార్దులను వివిధ అంశాల్లో ఎంపిక చేసిందన్నారు. అందులో సిద్దిపేట మండలం మూడు అవార్డులను కైవసం చేసుకొవడం గొప్ప విషయమన్నారు. జాతీయ స్థాయిలో సిద్దిపేట ప్రతిష్టను ఇనుమడింపజేసిన  ప్రజాప్రతినిధులను, అధికారులను అభినందించారు.

 వందశాతంతో దశ తిరిగింది
జిల్లాలో ఆయా గ్రామ పంచాయితీల్లో వందశాతం పన్ను వసూలు జిల్లా ఆర్థిక పరిస్థితిని మరింత మెరుగు పరిచిందని, కేంద్రం జిల్లా అధికారులు సాధించిన ప్రగతిని పరిగణలోకి తీసుకొని 14వ ఆర్థిక సంఘం కింద కోట్లాది నిధులను విడుదల చేయడం గొప్ప విషయమని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గతేడాది వార్షిక ఆస్తిపన్నులో జిల్లాలోని 1050 గ్రామ పంచాయితీలకు కేంద్రం రూ. 53 కోట్లను పారితోషికంగా ప్రకటించిందన్నారు.

ఒక్కో గ్రామ పంచాయితీకి రూ. 2 లక్షల చొప్పున ప్రోత్సాహకం రానుందన్నారు.  ఇంకుడుగుంతల నిర్మాణంలో రాష్ట్రానికే జిల్లా ఆదర్శంగా నిలిచి 30 వేల గుంతలతో మొదటి స్థానంలో నిలిచిందన్నారు. అందులో సిద్దిపేట నియోజకవర్గం 10 వేల ఇంకుడుగుంతలతో ఆగ్రగామిగా నిలిచిందన్నారు. అనంతరం ఇటీవల ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేతుల మీదుగా అవార్డులు అందుకున్న డీపీఓ సురేష్‌బాబు, సిద్దిపేట ఎంపీడీఓ సమ్మిరెడ్డి, సిద్దిపేట ఎంపీపీ యాదయ్య, ఇబ్రహీంపూర్, లింగారెడ్డి పల్లి సర్పంచ్‌లు లక్ష్మి, రామస్వామిను మంత్రి  సన్మానించారు.  కార్యక్రమంలో జేసీ వెంకట్‌రాంరెడ్డి, ఆర్డీఓ ముత్యంరెడ్డి,మున్సిపల్  చైర్మన్ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు