దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు

23 Aug, 2016 23:24 IST|Sakshi
దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు
విజయవాడ(ఇంద్రకీలాద్రి) :
కృష్ణా పుష్కరాల 12 రోజులలో 18.04 లక్షల మంది యాత్రికులు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇక అమ్మవారిని దర్శించుకున్న యాత్రికులు 22 లక్షల లడ్డూలను ప్రసాదంగా అందుకున్నారు. అమ్మవారి అన్న ప్రసాదాన్ని రెండు లక్షల మందికి పంపిణీ చేసినట్లు ఆలయ అధికారులు పేర్కొంటున్నారు. చివరి రోజైన మంగళవారం అమ్మవారి సన్నిధికి యాత్రికుల తాకిడి అధికంగానే ఉంది. మంగళవారం 1.75 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. సాధారణ యాత్రికులతోపాటు పలువురు వీఐపీలు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వీఐపీలకు ఆలయ ఈవో సూర్యకుమారి సాదరంగా స్వాగతం పలికారు. 
పుష్కర యాత్రికులకు దుర్గమ్మ కుంకుమ ప్రసాదం
నగరంలోని వేర్వేరు స్నానఘాట్లలో పుష్కర స్నానమాచరించిన యాత్రికులకు చివరి రోజున దుర్గమ్మ కుంకుమ ప్రసాదాన్ని పంపిణీ చేశారు. బస్టాండ్‌లోని నమూనా ఆలయంతోపాటు పున్నమి, భవానీ, సంగమం స్నాన ఘాట్లలో యాత్రికులకు అమ్మవారి కుంకుమ ప్యాకెట్లు పంపిణీ చేశారు. అమ్మవారి దర్శనం కాకపోయినా కుంకుమ ప్రసాదాన్ని నేరుగా యాత్రికులకు అందచేయడం సంతోషదాయకమని యాత్రికులు పేర్కొన్నారు. 
12వ రోజున 1.75 లక్షల మంది..
పుష్కరాలలో 12వ రోజున 1.75 లక్షల మంది యాత్రికులు అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున ఒంటి గంట నుంచి ప్రారంభమైన రద్దీ రాత్రి వరకు కొనసాగింది. అమ్మవారి దర్శనానికి బారులు తీరిన యాత్రికులతో క్యూలైన్లు కిటకిటలాడాయి. మంగళవారం 2.25 లక్షల లడ్డూలను దేవస్థానం విక్రయించింది. అమ్మవారి అన్న ప్రసాదాన్ని  21,600 మందికి అందచేశారు.
 
మరిన్ని వార్తలు