పొంగిపొర్లుతున్న వాగులు

18 Jul, 2017 23:56 IST|Sakshi
పొంగిపొర్లుతున్న వాగులు
ఎడతెగని వానతో
జనజీవనం అస్తవ్యస్తం
లోతట్టు ప్రాంతాలు జలమయం
నీటమునిగిన పంట పొలాలు
దెబ్బతిన్న పలు రహదారులు
ఏజెన్సీ మండలాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌
 
సాక్షి ప్రతినిధి, ఏలూరు ః
గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమైంది. తెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో ప్రజలంతా అష్టకష్టాలు పడుతున్నారు. బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంగా జిల్లాలో సోమవారం నుంచి ఎడతెగని వర్షం కురుస్తోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో ఏజెన్సీ మండలాలైన బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, కుక్కునూరు, వేలేరుపాడు తదితర ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి, దీంతో ఈ మండలాల్లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల పంటపొలాలు నీట మునిగాయి. నారుమళ్లు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు. వేలేరుపాడు మండలంలో మేళ్ళవాగు, ఎద్దెలవాగు, టేకూరు,వాగు, లోతు వాగులు పొంగిపారాయి. మండల కేంద్రంలో రహదారులపై నీళ్ళు పారాయి. జగన్నాధపురం,ఎర్రబోరు. సంతబజారు ప్రాంతాల్లో ఇళ్లలోకి నీళ్ళు చేరాయి. పెదవాగు రెండు æ గేట్లు ఎత్తివేయడంతో  మండలంలోని  కమ్మరిగుడెం, ఒంటిబండ, రామవరం ఊటగుంపు, గ్రామాలకు బాహ్యప్రపంచంతో  సంబంధాలు తెగిపోయాయి. అలాగే రామవరం వద్ద లోతువాగు, పొంగిపొర్లుతోంది. జీలుగుమిల్లి వద్ద అశ్వారావుపేటవాగు రోడ్డు పైనుండి ప్రవహిçంచడంతో రాకపోకలకు ఇబ్బంది కలిగింది. లంకాలపల్లి వద్ద సంగం వాగు ఉధ్రుతంగా ప్రవహిస్తోంది. ఎడ తెరపకుండ కురుస్తున్న వర్షాలకు జన జీవనం స్ధంభించింది. జీలుగుమిల్లి దేవరపల్లి జాతీయ రహదారిపై గోతులు వర్షపు నీటితో నిండి చెరువులను తలపిస్తున్నాయి. పోలవరం మండలంలో ఎల్‌ఎన్‌డిపేట వద్ద గల కొవ్వాడ రిజర్వాయర్‌లో కూడా భారీగా నీరు చేరింది. గుంజవరం వద్ద గల పేడ్రాల కాలువ, ప్రగడపల్లి వద్ద గల నక్కలగొంది కాలువలు పొంగి ప్రవహిస్తున్నాయి. అలాగే ఎగువ ఏజన్సీ ప్రాంతంలోని కొండవాగులు కూడా పొంగుతున్నాయి. మొగల్తూరు మండలంలోని పడమటిపాలెం, ఇంజేటివారిపాలెం, రామన్నపాలెం అడవిపర్ర, కాళీపట్నం మాగలేరు ఆయకట్టు భూములు ముంపునకు గురయ్యాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో రైతులు కలవరపడుతున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రపు వేటకు వెళ్ళవద్దని అధికారులు మత్యకారులను హెచ్చరిస్తున్నారు. చిట్టవరంలో ముంపు నీరు లాగకపోవడంతో ఇటీవలే ఊడ్చిన సార్వా పంటచేను నీట మునిగింది. తీర ప్రాంత గ్రామాలైన పెదమైనవానిలంక, చినమైనవానిలంక గ్రామాలలో సముద్రం అల్లకల్లోలంగా ఉండటంతో మత్స్యకారులంతా ఇళ్ళకే పరిమితమయ్యారు. ఉంగుటూరు మండలంలో 150 ఎకరాలలో వరిచేలు ముంపునకు గురయ్యాయి. మంగళవారం రాత్రి వర్షాలు కొనసాగితే వరిచేలు ముంపు పెరుగుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. వీరవాసరం, భీమవరం మండలాల్లోని సుమారు 2 వేల ఎకరాల్లో వరినాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు వేసిన వరినాట్లు నీటిలో మునిగి నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  దిప్పకాయలపాడులోని దళిత వాడలో భారీ వర్షానికి, ఈదురుగాలులకు ఒక ఇల్లు నేలమట్టమైంది.  
 
 
మరిన్ని వార్తలు