గుంటూరు అర్బన్ బ్యాంక్ వద్ద ఉద్రిక్తత

20 Jul, 2016 11:08 IST|Sakshi

గుంటూరు : గుంటూరు అర్బన్ బ్యాంక్ చైర్మన్ పదవికి తెలుగుదేశం, బీజేపీ నేతలు పోటాపోటీగా నామినేషన్లు వేసేందుకు తరలిరావడంతో బ్యాంక్ అవరణ వద్ద ఉద్రిక్తపరిస్థితి ఏర్పడింది. నామినేషన్లు దాఖలు చేసేందుకు బుధవారం చివరి గడువు కావడంతో ఉదయం నుంచే రెండు పార్టీలకు చెందిన నేతలు, కార్యకర్తలు భారీగా బ్యాంకు వద్దకు చేరుకున్నారు.

దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అర్బన్ బ్యాంక్ చైర్మన్ , వైస్‌ చైర్మన్ పదవులకు టీడీపీ అభ్యర్థులుగా శ్రీనివాసయాదవ్, జగ్గంపూడి శ్రీనివాస్ నామినేషన్లు వేసేందుకు తరలి వచ్చారు. అలాగే బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ అనుచరులు ప్రస్తుత చైర్మన్,  వైస్‌చైర్మన్ కొత్తమాక శ్రీనివాస్, రత్నబాబు కూడా తమ అనుచరులతో నామినేషన్ వేసేందుకు వచ్చారు.

దీంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు డి.నరేంద్ర, ఆలపాటి రాజేంద్రప్రసాద్ తదితర టీడీపీ నేతలు రాజీ కుదిర్చేందుకు చర్చలు జరుపుతున్నారు. దాంతో ఇరు పార్టీల నేతలకు చెందిన అనుచరులు, పార్టీల కార్యకర్తలతో అర్బన్ బ్యాంక్ ఆవరణ సందడిగా మారింది.

మరిన్ని వార్తలు